తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో పరుగులు, కొత్త కారిడార్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro : ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో పరుగులు, కొత్త కారిడార్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

01 August 2023, 19:42 IST

google News
    • Hyderabad Metro : ఓఆర్ఆర్ చుట్టూ హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదించింది. దీంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి.
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro : హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భాగ్యనగరానికి చుట్టూ మెట్రో విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో రైలు విస్తరణపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ మెట్రోను విస్తరించే ప్రణాళిక ఉందని ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నలువైపులా రూ.69 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. పటాన్‌ చెరు నుంచి నార్సింగ్‌ వరకు 22 కిలోమీటర్లు, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్‌ ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కి.మీ, మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరు వరకు 29 కిలోమీటర్లు, ఎల్‌బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో కారిడార్‌ విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్

సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో హైదరాబాద్ లో ప్రజారవాణా ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో వ్యవస్థను వివిధ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం కోటి మంది జనాభాకు సరిపోయేలా మెట్రో వ్యవస్థను విస్తరించేలా ప్రణాళికలు సిద్ధచేశామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. పటాన్‌ చెరు-నార్సింగ్‌ వరకు 22 కిలో మీటర్లు, తార్నాక-ఈసీఐఎల్‌ క్రాస్ రోడ్స్ వరకు 8 కిలో మీటర్లు, మేడ్చల్‌ జంక్షన్‌ - పటాన్‌ చెరు వరకు 29 కిలో మీటర్లు, ఎల్బీ నగర్‌ -పెద్ద అంబర్‌ పేట, శంషాబాద్‌- షాద్‌ నగర్‌, ప్యాట్నీ - కండ్లకోయ, ఉప్పల్‌-బీబీ నగర్‌ మధ్య 25 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తూముకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్ నిర్మిస్తామన్నారు. ఈ ఫ్లై ఓవర్ లో పైన మెట్రో రైలు, కింద వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఈ ప్రణాళికలపై కసరత్తులు తుది దశలో ఉన్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు.

కోటి జనాభాకు సరిపడేలా

హైదరాబాద్‌ నగరంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ విజన్‌తో ఓఆర్‌ఆర్‌ మెట్రోకు ముందడుగు పడిందని పేర్కొన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో అనుసంధానం చేపడతామన్నారు. శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు 28 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ విస్తరించనున్నట్లు చెప్పారు. ఉప్పల్ నుంచి బీబీనగర్‌ వరకు 25 కిలోమీటర్లు, తార్నాక నుంచి మౌలాలి వరకు 5 స్టేషన్లతో మెట్రో రైలు విస్తరిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కోటి జనాభాకు సరిపడేలా మెట్రో రైలు విస్తరించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్నారు.

తదుపరి వ్యాసం