తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Metro: డాన్స్ ఎఫెక్టేమో..! మెట్రో స్టేషన్లలో అలాంటివి చేస్తే జైలు శిక్షే..

Hyd Metro: డాన్స్ ఎఫెక్టేమో..! మెట్రో స్టేషన్లలో అలాంటివి చేస్తే జైలు శిక్షే..

HT Telugu Desk HT Telugu

23 July 2022, 16:11 IST

google News
    • hyderabad metro statement:హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సంస్థలకు ఎలాంటి నష్టం కలిగించినా, ప్రాంగణంలో ఏదైనా అనధికారిక కార్యకలాపాలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
మెట్రో స్టేషన్లలో ఆంక్షలు
మెట్రో స్టేషన్లలో ఆంక్షలు

మెట్రో స్టేషన్లలో ఆంక్షలు

hyderabad metro strong notice to public: హైదరాబాద్ మెట్రో... ఏ స్టేషన్లలో చూసినా బిజీబిజీ..! ప్రయాణికుల రద్దీతో దర్శనమిస్తుంటాయి. ఇక ఇందులో కొందరూ సెల్ఫీలకు ఫొజోలు ఇస్తుంటారు..! ఇంతవరకు ఒకే కానీ... తాజాగా మెట్రో స్టేషన్ లో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై మెట్రో అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఏకంగా వీడియో చేసిన యువ‌తిపై ఫిర్యాదు కూడా చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ మెట్రో సంస్థ...ఓ బహిరంగ ప్రకటన చేసింది. మెట్రో సంస్థలకు ఎలాంటి నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు సంబంధించిన ప్రాపర్టీల్లో పోస్టర్లు అతికించడం/పెట్టడం వంటివి చేయొద్దని... ఏదైనా విషయాన్ని రాయడం, గీయడం లాంటి నష్టం కలిగిస్తే చర్యలుంటాయని పేర్కొంది.

హైదరాబాద్ మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన లేదా పోస్ట్ చేసిన ఏదైనా బోర్డు, డాక్యుమెంట్‌లను క్రిందికి లాగకూడదని, ఉద్దేశపూర్వకంగా పాడు చేయకూడదని వెల్లడించింది. అలాంటి బోర్డు లేదా డాక్యుమెంట్‌లపై, ఏదైనా ఇతర హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాపర్టీలపై ఉన్న అక్షరాలు లేదా బొమ్మలను తుడిచివేయకూడదని, మార్చకూడదని స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ప్రాంగణంలో ఏ అనధికార కార్యకలాపాన్ని నిర్వహించకూడదని ప్రకటనలో ప్రస్తావించింది.

<p>హైదరాబాద్ మెట్రో ప్రకటన</p>

హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులు, ప్రాంగణంలో ఏదైనా అనధికారిక కార్యకలాపాలు, నష్టం కలిగించడం లాంటివి చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. ఏ వ్యక్తి అయినా అలా చేసినట్లు గుర్తించినట్లయితే, మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & మెయింటెనెన్స్) చట్టం- 2002లోని సెక్షన్ 62 ఆర్‌డబ్ల్యూ, సెక్షన్ 72 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారని పేర్కొంది. తీవ్రతను బట్టి రెండింటిని కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. మెట్రో సంస్థకు ఎలాంటి నష్టాన్ని కలగజేయవద్దని ప్రకటనలో కోరింది.

తదుపరి వ్యాసం