తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Metro: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో 'ఆఫీస్ బబుల్స్'… దేశంలో ఇదే ఫస్ట్ టైం

Hyd Metro: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో 'ఆఫీస్ బబుల్స్'… దేశంలో ఇదే ఫస్ట్ టైం

HT Telugu Desk HT Telugu

01 July 2022, 12:41 IST

google News
    • office bubbles at hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్లు సరికొత్తగా హంగులతో రూపుదిద్ధుకోబోతున్నాయి. దేశ చరిత్రలోనే మొదటి సారిగా మెట్రో స్టేషన్ల నుంచే ఆఫీసు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా 'ఆఫీస్ బబుల్స్' ను ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా మెట్రో యాజమాన్యం అడుగులు వేసేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో (twitter)

హైదరాబాద్ మెట్రో

Office bubbles at hyderabad metro: దేశ మెట్రో రైలు చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్‌ మెట్రో...సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్ నుంచి ఆఫీసు కార్యకలాపాల్ని నిర్వహించుకునేందుకు వీలుగా ‘ఆఫీసు బబుల్స్‌’ పేరుతో కో-వర్కింగ్‌ స్పేసెస్‌ను ఆఫర్‌ చేయడానికి సిద్దమయ్యింది. నగరంలో కో-వర్కింగ్‌ స్పేస్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలను దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌ బబుల్స్‌ను నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఫలితంగా ఆయా కంపెనీలు నగరవ్యాప్తంగా చిన్నచిన్న ఆఫీసులుగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించింది.

అద్దెకు స్థలాలు…

మెట్రోరైలు స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థలాలను కార్యాలయాలకు అద్దెకివ్వనున్నారు. రిటైల్‌ దుకాణాల కోసం ప్రతి స్టేషన్‌లో స్థలాలు వదిలినప్పటికీ పెద్దగా స్పందన లేదు. దీంతో ప్రధాన స్టేషన్లలో కో వర్కింగ్‌ స్పేస్‌లుగా మారుస్తున్నారు. వర్క్‌, షాపింగ్‌, లీజర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, హెల్త్‌కేర్‌ విభాగాల కోసం మెట్రో రైల్‌లో 18.5 మిలియన్‌ చదరపు అడుగుల ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ (టీవోడీ) అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.

4 లక్షల చదరపు అడుగుల స్థలం...

అద్దె స్థలానికి సంబంధించి యాజమాన్యం వివరాలను వెల్లడించింది. 3 కారిడార్లలోని 57 మెట్రో స్టేషన్లలో 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అద్దెకు ఇచ్చేందుకు అందుబాటులో ఉందని వివరించింది. 49 మెట్రోరైలు స్టేషన్లలో ప్రతిచోటా రెండు యూనిట్లలో 1750 చదరపు అడుగుల ప్రాంగణం అందుబాటులో ఉంది. అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, మియాపూర్‌, నాగోల్‌, జేబీఎస్‌, పంజాగుట్ట వంటి పెద్ద స్టేషన్లలో 5వేల నుంచి 30వేల చదరపు అడుగుల స్థలాలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో వృద్ధి చెందుతున్న కోవర్కింగ్‌ ప్రాంగణాల డిమాండ్‌ను తీర్చడంతో పాటూ ప్రాంతం ఎంపికకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎల్‌ అండ్‌ టీ మెట్రో తెలిపింది.

ఆఫీస్‌ బబుల్స్‌ సదుపాయాలు

మెరుగైన మౌలిక సదుపాయాలు,వేగవంతమైన, నాణ్యతతో కూడిన నెట్‌వర్క్‌.

57 మెట్రో రైలు స్టేషన్‌లలో పటిష్టమైన భద్రత, నిరంతరం సీసీ కెమెరాల నిఘా.

ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌తో సమర్ధవంతమైన డాటా కనెక్టివిటీతో పాటు ఆధునిక అగ్నిమాపక సామాగ్రితో రక్షణ అందుబాటులో ఉంది.

ఉద్యోగి ప్రయాణ సమయం తగ్గింపుతో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ కు అనుకూలంగా ఉంటుంది.

మెట్రో రైలు ద్వారా ఉద్యోగులకు సులభమైన ప్రయాణం, అందుబాటులో పార్కింగ్ స్థలాలు. అత్యవసర సమయంలో ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉండనున్నాయి.

తదుపరి వ్యాసం