Hyderabad MLC Elections : ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. బరిలో బీజేపీ.. ?
21 February 2023, 21:20 IST
- Hyderabad MLC Elections : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో... ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రసవత్తరంగా మారనున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు
Hyderabad MLC Elections : తెలంగాణ రాజకీయాల్లో.. బీఆర్ఎస్, ఎంఐఎం.. 2014 నుంచి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సర్కార్ పై.. వాడీ వేడీ విమర్శలు చేసే ఎంఐఎం.. బయట బహిరంగ వేదికలపై మాత్రం.. బీఆర్ఎస్ పాలన భేష్ అంటోంది. కేసీఆర్ సాబ్ కి తమ సహకారం ఎల్లవేలలా ఉంటుందని నిర్మొహమాటంగా ప్రకటిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల సమయంలోనూ ఈ రెండు పార్టీలు ఒకరికి ఒకరు ఇబ్బంది కలిగించకుండా వ్యూహాలు అమలు చేస్తాయన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఇక.. 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో... మజ్లిస్ సహకారంతో మేయర్ పీఠంపై గులాబీ పార్టీ జెండా ఎగురవేయగలిగింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.... బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య దోస్తీ మరోసారి ఫోకస్ లోకి వచ్చింది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నందున... కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం.. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎంఐఎంకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే... హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ సయ్యద్ జాఫ్రీకే మరోసారి అవకాశం కల్పిస్తారని అంతా అనుకున్నప్పటికీ... ఇప్పటికే ఆయన మూడుసార్లు శాసనమండలి సభ్యుడిగా పనిచేసినందున... కొత్త వారికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో... మీర్జా రెహమత్ బేగ్ కు అవకాశం కల్పించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 129 ఓట్లు ఉండగా.. ఇందులో 9 ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఓట్లలో... ఎంఐఎంకు 52, బీఆర్ఎస్ కు 41, బీజేపీకి 25 చొప్పున ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లలో 61 ఓట్లు వస్తే గెలిచినట్టు అవుతుంది. అంటే.. ఏ పార్టీకి కూడా సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే... బీఆర్ఎస్.. ఎంఐఎంకు మద్దతు తెలిపింది.
అయితే... నిన్నటి వరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై అంతగా దృష్టి సారించని బీజేపీ.. తాజా పరిణామాలతో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.... బీజేపీ కూడా బరిలో దిగాలని యోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ... ఓటింగ్ తప్పనిసరి కానుంది. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలకు కలిపి.. మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నా... బీజేపీ పోటీలో ఉండాలని చూస్తోందని... తద్వారా ఎన్నికలను రాజకీయంగా ఉపయోగించుకోవచ్చని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.... హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ తరపున వెంకట నారాయణ రెడ్డిని ప్రకటించింది..... బీజేపీ.
మరోవైపు... టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకూ అధికార పార్టీ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. 2017లో ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్టీయూ-టీఎస్ అభ్యర్థికి అధికార పార్టీ మద్దతిచ్చిన విషయం విదితమే. ఇక మహబూబ్‌నగర్ - రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఉపాధ్యాయ నియోజకవర్గం, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.