Black Magic : తాంత్రిక చికిత్స పేరుతో మోసాలు… బెడిసికొట్టిన పెళ్లి ప్రయత్నం…
13 February 2023, 5:44 IST
- Black Magic తాంత్రిక చికిత్సల పేరుతో అమాయకుల్ని ఘరానా మోసగాడి లీలలు హైదరాబాద్‌లో వెలుగు చూసింది. దేవుడిపై నమ్మకంతో దర్గాకు వచ్చే భక్తుల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాంత్రిక పూజలు, చికిత్స పేరుతో మహిళల్ని మోసగిస్తున్నట్లు గుర్తించారు.
లంగర్ హౌస్ పోలీసుల అదుపులో తాంత్రిక పూజారి
Black Magic భక్తుల అమాయకత్వమే అతనికి పెట్టుబడిగా మారింది. భక్తి విశ్వాసాలను అడ్డుపెట్టుకుని బాబా అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. దర్గా సందర్శనకు వచ్చే అమయాక భక్తులను బుట్టలో వేసుకుని మాయమాటలు చెబుతూ మళ్లీ అక్కడకు వచ్చేలా చూసుకుంటాడు.
ఆర్థిక స్తోమత లేనివారిని, ముందూ వెనుక ఎవరూలేని భక్తులను గుర్తించి వలలో వేసుకోవడం, పెళ్లి పేరుతో మోసాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతిని పెళ్లి పేరుతో మోసం చేయాలని ప్రయత్నించడంతో బంధువులు అనుమానించి ఆరా తీయడంతో నకిలీ బాబా భాగోతం బయటపడింది. నిందితుడు హఫీజ్ పాషాను లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట్‌కు చెందిన హఫీజ్ పాషా, నెల్లూరు దర్గా సమీపంలోని మహల్‌లో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. దర్గాకు ప్రాముఖ్యత ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈక్రమంలో హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన బాధితురాలిని పాషా మోసం చేశాడు.
కొన్ని నెలల క్రితం యువతికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె తండ్రి కడప, గుల్బర్గా వంటి ప్రముఖ దర్గాలకు నయం చేసేందుకు తీసుకెళ్లాడు. అనారోగ్యం తగ్గకపోవడంతో స్థానికులు నెల్లూరులోని ఏఎస్‌పేటకు వెళ్లమని చెప్పారు. అక్కడ హఫీజ్ పాషా వారికి పరిచయం అయ్యాడు. ఆమెకు దెయ్యం పట్టిందని, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులను బాబా నమ్మించాడు. దాదాపు మూడేళ్ల నుంచి చికిత్స తీసుకుంటున్నా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల్లో ఆ అమ్మాయి చనిపోతుందని ఆమె కుటుంబ సభ్యులను బెదరగొట్టాడు.
ఆమెను పెళ్లి చేసుకుని ప్రాణాలు కాపాడుకుంటానని నమ్మించడంతో యువతి బంధువులు హఫీజ్‌పాషాతో పెళ్లికి అంగీకరించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్ టోలిచౌక్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి సమయానికి వరుడు రాకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో అతని బంధువులను సంప్రదించగా అనారోగ్యంతో ఉన్నాడని చెప్పారు.
యువతి కుటుంబ సభ్యులకు బాబా ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరా తీశారు. గతలో అనేక మందిని ఇలాగే పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. నెల్లూరులోని వివిధ పోలీస్ స్టేషన్లలో హఫీజ్ పాషాపై 13 కేసులు నమోదైనట్లు గుర్తించారు. మాయగాడి నిర్వాకం తెలియడంతో యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హఫీజ్ పాషాకు ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు జరిగినట్టు లంగర్‌హౌస్ సీఐ శ్రీనివాస్ వివరించారు. మరింత సమాచారం వెలుగు చూడాల్సి ఉందన్నారు.
టాపిక్