Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి, కరీంనగర్ యువకుడు సూసైడ్
30 July 2023, 22:09 IST
- Loan App Harassment : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలైయ్యాడు. కరీంనగర్ కు చెందిన యువకుడు లోన్ యాప్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో... నిర్వాహకులు అతడిని వేధించారు. దీంతో అతడు సూసైడ్ చేసుకున్నాడు.
లోన్ యాప్ వేధింపులు
Loan App Harassment : ఆన్ లైన్ లోన్ యాప్ ఆగడాలు మళ్లీ పెరుగుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో కరీంనగర్ కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ కు చెందిన నరేష్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నాడు. ఆన్ లైన్ లోన్ యాప్ ల్లో డబ్బులు తీసుకున్న నరేష్, సమయానికి తిరిగి డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు నరేష్ ను వేధింపులకు గురిచేశారు. నరేష్ కాంటాక్ట్స్ లోని నెంబర్లకు అసభ్యకరంగా మెసేజ్ పంపి వేధింపులు మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ , తాను ఉంటున్న హాస్టల్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న నరేష్.... అక్కడికి దగ్గర్లోని ఆర్బీనగర్‌లో బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. నరేష్ ఫోన్‌కు గతంలో ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా ఓ మెసేజ్ వచ్చింది. దీనికి స్పందించిన అతడు ఆ యాప్ నుంచి లోన్ తీసుకున్నాడు. లోన్ తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవ్వడంతో...లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు. అతడి ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించారు. నరేష్ లోన్ యాప్ డబ్బులు తిరిగి చెల్లించలేదని, దానికి బదులుగా అతని ఇంట్లో ఆడవాళ్లని కావాలంటే పంపిస్తానని చెబుతున్నట్టుగా అసభ్యకరంగా మెసేజ్ పంపారు. ఈ మెసేజ్ చూసి కుంగిపోయిన నరేష్... విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరేష్ చనిపోయిన తర్వాత కూడా అతడి ఫోన్‌కి యాప్ నిర్వాహకులు కాల్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న పోలీసులు.. నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ వెంటనే కట్ చేశారు. నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... నరేష్ ఆత్మహత్యకు కారకులైన నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. లోన్ యాప్ మాయగాళ్ల వలలో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి
నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోయారు. ఓ యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు దిగారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను యువతి కాంటాక్ట్స్ కు పంపించి మానసికంగా వేధించారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ యువతికి వారం రోజుల క్రితం రూ. 3 వేలు అవసరమై ఆన్లైన్ లో లోన్ యాప్ లను సెర్చ్ చేసి క్యాండీ క్యాష్, ఈజీ మనీ యాప్ లలో తన వివరాలు నమోదు చేసింది. ఈ రెండు లోన్ యాప్ ల నుంచి రూ.3,700 యువతి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. అయితే మూడు రోజుల తరువాత అప్పుగా తీసుకున్న అమౌంట్ ను యువతి తిరిగి లోన్ యాప్ లకు చెల్లించింది. యువతి తీసుకున్న అమౌంట్ లోన్ యాప్ లకు చెల్లించినా... ఇంకా కట్టాలని లోన్ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. తాము అడిగిన డబ్బు కట్టకపోతే తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామని, బంధువులకు పంపించి పరువు తీస్తామని యువతిని బెదిరించారు. శుక్రవారం యువతి ఫోన్ ను హ్యాక్ చేసిన యాప్ నిర్వహకులు... మార్ఫింగ్ చేసిన యువతి ఫొటోలను ఆమె కాంటాక్ట్ నెంబర్లకు పంపించారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక, మనోవేదనకు గురైన బాధిత యువతి చివరకు దిశ యాప్ లో SOSకు కాల్ చేసి సాయం కోరింది. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు లోన్ యాప్ నిర్వహకులపై కేసు నమోదు చేశారు. సైబర్ పోలీసులు కూడా లోన్ యాప్ నిర్వాహకుల వివరాలు సేకరిస్తున్నారు.