Jagga Reddy : సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారాలు, రాహుల్ గాంధీకి అన్నీ చెప్పేస్తా - జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
27 June 2023, 14:08 IST
- Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకు పెట్టింది పేరు. తాజాగా సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ వెళ్లిన ఆయన.. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ మొదలైంది. ఇటీవల చేరికలతో కాస్త జోష్ ఉన్న కాంగ్రెస్ నేతలు మళ్లీ అంతర్గత కుమ్ములాటలు మొదలుపెట్టారు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీలో పరిస్థితులపై హైకమాండ్ కు వివరిస్తానని బాంబ్ పేల్చారు. దిల్లీ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సొంత నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దుస్థితి వచ్చిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు తానెప్పుడూ ఎప్పుడూ చూస్తాననుకోలేదన్నారు. తనపై నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా తనను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ తనను దిల్లీ రావాలని పిలిచారని, ఆయనకు అన్ని విషయాలూ వివరిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ ఐక్యంగా ఉందో? లేదో? చెప్పలేనన్న ఆయన.. అలాంటి విషయాలు చెప్పేవాడినీ కానన్నారు.
పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం
తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ వింత పరిస్థితి ఉంటుంది. సొంత పార్టీ నేతలపైనే ఒకరికొకరు హైకమాండ్ కు ఫిర్యాదు చేసుకుంటారు. ఇటీవల ఈ వివాదాలు సోషల్ మీడియాకు పాకింది. సొంత పార్టీ నేతలనే ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అంతే కాకుండా ఉత్తమ్ కుమార్ హైకమాండ్ కూ ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి వర్గంపై ఎప్పుడూ విమర్శలు చేసే జగ్గారెడ్డి... మరోసారి పేరు చెప్పకుండా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏం దరిద్రమోగానీ నిత్యం శీలపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పార్టీ మార్పు గురించి దుష్ప్రచారం చేస్తున్నారని, అది చాలా బాధ కలిగిస్తోందని అన్నారు.
లాలూచీ పడే వ్యక్తిని కాదు
దిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి.. పార్టీ అంతర్గత విషయాలపై రాహుల్ గాంధీకి చెప్తానంటారు. తాను పైరవీకారుడిని కాదని, పిలిస్తేనే దిల్లీకి వస్తానని తెలిపారు. ఎవరితో లాలూచీ పడే వ్యక్తిని కాదని, ఎవరికీ భయపడనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంత బతుకు బతికి కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందను కోలేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి హైకమాండ్ వివరిస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక ఎన్నికల వ్యూహాన్నే తెలంగాణలోనూ అమలుచేయాలని హైకమాండ్ భావిస్తు్న్నట్లు తెలుస్తోంది.