Liquor Shops 24x7 Open : 24గంటలు షాపులు తెరవొచ్చు.. వైన్ షాపులకు మాత్రం కుదరదు
10 April 2023, 8:42 IST
- Liquor Shops 24x7 Open : తెలంగాణలో 24 గంటలు దుకాణాలు తెరుచుకునేందుకు ప్రభుత్వం ఇటీవల జీవో జారీచేసింది. మద్యం దుకాణాలు మాత్రం ఈ జీవో పరిధిలోకి రావని స్పష్టం చేసింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కింద ఏర్పాటైన వాటికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టత ఇచ్చారు.
లిక్కర్ షాపులకు 24 గంటల అనుమతి లేదని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Liquor Shops 24x7 Open : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 24X7 షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ అయింది. అయితే మద్యం షాపులు కూడా 24 గంటలూ ఓపెన్ చేసి ఉంటాయని ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అన్ని షాపులు, సంస్థలు 24×7 తెరిచి ఉండరాదని, ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవి మాత్రమే తెరచి ఉంటాయని ప్రభుత్వం ఆదివారం స్పష్టతనిచ్చింది.
ఏప్రిల్ 4న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటలూ వ్యాపారం కోసం తెరిచి ఉండే దుకాణాలు, సంస్థలకు ఇందులో మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అనుమతులకు పరిమితులు ఉన్నాయని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కార్మిక, ఉపాధి శిక్షణ , పరిశ్రమల శాఖ వివరణ ప్రకారం జీవో నెం 4... తెలంగాణ దుకాణాలు , సంస్థల చట్టం,1988లోని సెక్షన్ 7 నుంచి మినహాయింపు అన్ని సంస్థలకు వర్తించదని స్పష్టం చేసింది. దుకాణాలు ,సంస్థలు 24×7 పనిచేయడానికి ప్రభుత్వం నుంచి తగిన అనుమతి పొందాలని పేర్కొంది.
మద్యం షాపులకు ఈ జీవో వర్తించదు
24 గంటలు మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలు జీవో 4 పరిధిలోకి రావని తెలిపింది. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, విదేశీ మద్యం డిపోలు, డిస్టిలరీలు, బ్రూవరీలు, ఏ4 దుకాణాలు, 2బీ బార్‌లు ఎక్సైజ్ చట్టాలకు అనుబంధంగా నిర్ణీత సమయాల్లో మాత్రమే పనిచేయాలని సూచించింది.
రాష్ట్రంలో 24 గంటలూ దుకాణాలు తెరిచే నిబంధన తెలంగాణ దుకాణాలు, సంస్థలు చట్టం -1988 పరిధికి లోబడి అమలవుతుందని రాష్ట్ర కార్మికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని తెలిపారు. జీవో నెం.4 కింద ఇచ్చిన 24 గంటలూ షాపుల తెరిచే నిబంధన అన్ని దుకాణాలకు వర్తించదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే షాపులు , సంస్థలు 24 గంటలూ నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. అదేవిధంగా ఈ జీవో ఎక్సైజ్, ప్రొహిబిషన్‌శాఖకు వర్తించదని స్పష్టం చేశారు. దీంతో పాటు 24 గంటలూ దుకాణాలు తెరుచుకునేందుకు సంవత్సరానికి రూ. 10 వేలు రుసుము చెల్లించాలని తెలిపారు. అంతేగాక ఉద్యోగులకు సంబంధించిన కీలక నిబంధనలు కూడా పాటించాలన్నారు. 24 గంటలూ తెరిచి ఉంచే దుకాణాలకు పాటించాల్సిన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.
1. దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి తప్పనిసరిగా గుర్తింపు కార్డు మంజూరు చేయాలి
2. సిబ్బందికి వారంతపు సెలవులు ఇవ్వాలి.
3. ప్రతీ వారం సిబ్బందికి నిర్దిష్టంగా పనిగంటలను ఉండాలి.
4. సిబ్బంది అదనంగా పనిచేస్తున్నట్లయితే ఓవర్ టైమ్ వేతనాన్ని చెల్లించాలి.
5. ప్రభుత్వ సెలవులు, జాతీయ సెలవులు, వీక్లీ ఆఫ్ రోజు పని చేస్తే మరో రోజున సీఆఫ్ తీసుకునే వెసులుబాటు కల్పించాలి.
6. పోలీసు యాక్టులోని నిబంధనలను దుకాణదారులు తప్పనిసరిగా పాటించాలి.
7. షాప్స్ లో పనిచేసే మహిళలకు తగిన భద్రత కల్పించాలి.
8. నైట్ షిప్టుల్లో పనిచేసే మహిళా సిబ్బంది నుంచి ముందుగా రాతపూర్వక అంగీకారం తీసుకోవాలి.
9. నైట్ షిప్టుల్లో పనిచేసే మహిళా సిబ్బందికి రవాణా సదుపాయం కల్పించాలి.
10. యాజమాన్యాలు క్రమం తప్పకుండా రికార్డులను సమర్పించాలి