Gaddar Final Journey : గద్దర్ అంతిమయాత్రలో భారీగా అభిమానులు, మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు
07 August 2023, 15:15 IST
- Gaddar Final Journey : గద్దర్ అంతియాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం అయింది. గన్‌పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం చేరుకోనుంది. మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గద్దర్ అంతిమ యాత్ర
Gaddar Final Journey : ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్ర హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం, అల్వాల్‌లోని ఆయన నివాసానికి కొనసాగుతోంది. గద్దర్ పార్థివదేహాన్ని అల్వాల్‌లోని ఆయన నివాసం దగ్గర కొద్ది సమయం ఉంచి, తర్వాత ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర అంతిమయాత్రను కొద్దిసేపు నిలపివేయనున్నారు. నిన్నటి నుంచి ప్రజాగాయకుడు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు తరలివచ్చారు. గద్దర్ భౌతికకాయాన్ని చూసి అనేకమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కోమటిరెడ్డి నేతలు గద్దర్‌కు నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సినీ ప్రముఖులు మంచు మోహన్ బాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, హీరో మనోజ్, కొణిదెల నాగబాబు, నిహారిక, అలీ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
పోలీసుల పటిష్ఠ భద్రత
గద్దర్ అంతిమయాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. గద్దర్ అంత్యక్రియల సందర్భంగా మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు పాల్గొనే అవకాశం ఉందన్న కారణంతో అంతిమయాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. గద్దర్ అంతిమయాత్రలో సీసీ కెమెరా మౌంటెడ్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు కొనసాగుతున్న నేపథ్యంలో వేలాదిగా అభిమానులు, కళాకారులు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. అంతిమయాత్రలో పాల్గొంటున్న వ్యక్తుల కదలికలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. గద్దర్‌తో సాయుధ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉన్న వారిపై కేసులు నమోదై ఉన్నాయి. చాలా మంది జైలుకు వెళ్లారు. మాజీ మావోయిస్టులు గద్దర్ ను చివరిసారి చూసేందుకు అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశారు. సుమారు 12 కిలోమీటర్ల మేర కొనసాగే అంతిమయాత్రలో వ్యక్తుల కదలికలను మౌంటెడ్ సీసీ కెమెరా వెహికల్ ద్వారా గమనిస్తున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు గద్దర్ అంతిమయాత్రపై నిఘా పెట్టారు.