తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Motkupalli On Chandrababu : జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారు, చంద్రబాబు ముష్టి రూ.300 కోట్లకు ఆశపడ్డారా?- మోత్కుపల్లి

Motkupalli On Chandrababu : జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారు, చంద్రబాబు ముష్టి రూ.300 కోట్లకు ఆశపడ్డారా?- మోత్కుపల్లి

23 September 2023, 13:56 IST

google News
    • Motkupalli On Chandrababu : చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యత అన్నారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Motkupalli On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను పార్టీలకు అతీతంగా నేతలు ఖండిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబును అరెస్టును ఖండించారు. చంద్రబాబును అరెస్ట్ చేయించినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన...జగన్ ను నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారన్నారు. జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే అందుకు జగన్‌దే బాధ్యత అన్నారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని ఆరోపించారు. ఏపీలో దళితులపై ఇన్ని దాడులు ఎప్పుడూ చూడలేదన్నారు.

ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా?

చంద్రబాబు లాంటి నేతలను జైలులో పెట్టి సీఎం జగన్ రాక్షసానందం పొందుతున్నారని మోత్కుపల్లి అన్నారు. వైఎస్‌ఆర్ కూడా ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారన్నారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపేశారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల కోసం రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి అన్నారు. అలాంటి చంద్రబాబు ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా? అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నిరసన దీక్ష చేస్తాన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు.

2019లో అలా

అయితే మోత్కుపల్లి నర్సింహులు 2019లో చంద్రబాబును ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఓటమితో ఏపీకి పట్టిన పీడ విరగడయ్యిందని అప్పట్లో ఆయన అన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ప్రజలు గోరీ కట్టారని తెలిపారు. టీడీపీ ఓడిపోడంతో మోత్కుపల్లి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌‌ వద్ద నివాళులు అర్పించి, ఆనందంతో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఎన్టీఆర్ కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు నర్సింహులు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపిన సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.

చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ విచారిస్తుంది. శనివారం ఉదయం 9.30 గంటలకు ముందే సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబును వైద్య పరీక్షలకు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు విచారణను ప్రారంభించారు. ఈ విచారణకు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌‌ను అనుమతించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెలవప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో.. ఆ తీర్పును చంద్రబాబు తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. దర్యాప్తు చివరి దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన సంగతి తెలిసిందే.

తదుపరి వ్యాసం