Hyderabad Traffic Diversions : రేపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూసివేత, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
03 October 2023, 20:10 IST
- Hyderabad Traffic Diversions : హైదరాబాద్ లోని పలుప్రాంతాల్లో రేపు(అక్టోబర్ 4న) ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైకిలింగ్ టు ఓటు మారథాన్ నిర్వహిస్తోంది.
ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Diversions : ఓటు ప్రాముఖ్యత, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు జాతీయ ఎన్నికల కమిషన్ ఈ నెల 4న ఉదయం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు " సైకిలింగ్ టు ఓట్ మారథాన్ " కార్యక్రమం నిర్వహించనుంది. ఈ మారథాన్ కేబుల్ బ్రిడ్జి - ఇనార్బిట్ మాల్ - మై హోమ్ అబ్రా యూటర్న్ - ఐటీసీ కోహినూర్ మీదుగా పయనించి తిరిగి కేబుల్ బ్రిడ్జి వద్ద ముగుస్తుంది. మారథాన్ కార్యక్రమం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. దాంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు, రహదారి మూసివేత పాయింట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసింది.
కేబుల్ బ్రిడ్జి మూసివేత
అక్టోబర్ 4 ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు " సైకిలింగ్ టు ఓట్ మారథాన్ " జరుగనున్న నేపథ్యంలో సాధారణ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరెట్ ప్రకటించింది.
ఈ ఏరియాల్లో ట్రాఫిక్ మళ్లింపు
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కావూరి హిల్స్, మాదాపూర్ ఎల్ అండ్ ఓ పోలీస్ స్టేషన్ - సీఓడీ జంక్షన్, సైబర్ టవర్ వైపు మళ్లిస్తారు. అలానే బయో డై వర్సిటీ పార్క్ జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వచ్చే ట్రాఫిక్ సైబర్ టవర్స్- సీఓడీ, రోడ్ నెం. 45 జూబ్లీ హిల్స్ వైపు మళ్లిస్తారు. మీనాక్షి జంక్షన్ నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వచ్చే ట్రాఫిక్ ఐకియా రోటరీ - లెఫ్ట్ టర్న్ - సైబర్ టవర్స్ - సీఓడీ - రోడ్ నంబర్ 45 నుంచి మళ్లిస్తారు. సీఓడీ నుంచి దుర్గం చెరువు మార్గంలో, ఐటీసీ కోహినూర్ నుంచి ఐకియా రోటరీ, ఐకియా రోటరీ నుంచి ఐటీసీ కోహినూర్ వరకు ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య ఈ మార్గంలో భారీ వాహనాలకు అనగా లారీలకు, ట్రక్కులకు, వాటర్ ట్యాంకర్లకు అనుమతి లేదని సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. ప్రజలంతా ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పక పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కోరారు.