తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miyapur Ci Suspended : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన, మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు

Miyapur CI Suspended : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన, మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు

HT Telugu Desk HT Telugu

06 February 2024, 21:05 IST

google News
    • Miyapur CI Suspended : కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్ కు వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో సీఐ అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.
మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు
మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు

మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు

Miyapur CI Suspended : ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. భర్త వేధింపులు భరించలేక అతడిపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళా వచ్చింది. ఆ మహిళతో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి సీఐ ప్రేమ్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన అవినాష్ మహంతి సీఐ మహిళతో దురుసుగా ప్రవర్తించినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ స్టేషన్ ఎదుట యువతి నిరసన

తనను ఎస్ఐ మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ నిరసనకు దిగింది. ఈ సంఘటన నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తనను

మోసం చేశాడని నిరసన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఎస్ఐ విధుల్లో లేకపోవడంతో ఆ మహిళ వెను తిరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనారే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పటికే ఎస్సై వ్యక్తిగత పనులు నిమిత్తం నాలుగు రోజుల సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఎస్ఐపై వివాదాలు వెలుగు చూడడంతో పోలీసు శాఖ విచారణ జరిపి చర్యలు తీసుకున్నందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్

హైదరాబాద్ లోని పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో ప్రజాభవన్ ముందు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిని తప్పించడంలో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తేల్చడంతో.... ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి మాజీ సీఐ దుర్గారావు పరారీలో ఉన్నాడు. అతడిని పోలీసులు వెతుకుతున్న క్రమంలో....ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం గుంతకల్ రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు దుర్గారావును విచారిస్తున్నారు. కాగా దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

డిసెంబర్ 23వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు బారికెడ్లను బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ ను తప్పించి అతడి డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుడు సోహెల్ దుబాయ్ పారిపోగా అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు అతనే ప్రధాన నిందితుడిని తప్పించడంలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సీఐ దుర్గారావు పై 17 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ దుర్గారావు సస్పెండ్ చేశారు. ఆయనతోపాటు సోహైల్ విదేశాలకు వెళ్లేందుకు సహకరించారని తేలడంతో బోధన్ సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం