Bigg Boss : బిగ్ బాస్ లో ఛాన్స్ అంటూ మాయమాటలు, యాంకర్ వద్ద రూ.5 లక్షలు కొట్టేసిన కేటుగాడు
23 January 2024, 22:08 IST
- Bigg Boss : బిగ్ బాస్ షోలోకి పంపిస్తానని ఓ యాంకర్ వద్ద రూ.5 లక్షలు కొట్టేశాడో కేటుగాడు. అతడు బిగ్ బాస్ ఇన్ ఛార్జ్ కావడం ఇక్కడ విశేషం.
యాంకర్ స్వప్న
Bigg Boss : బిగ్ బాస్ ఉచ్చులో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యాంకర్ చిక్కుకుంది. బిగ్ బాస్ షోలో అవకాశం కోసం ఓ మధ్యవర్తికి డబ్బులు ఇచ్చి మోసపోయింది. అవకాశం కల్పిస్తానంటూ కాలయాపన చేసి చివరికి చేతులెత్తేయడంతో ఆ యాంకర్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనను బిగ్ బాస్-7లోకి పంపిస్తానంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ స్వప్న అనే యాంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా టాలీవుడ్లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్ ఇన్ ఛార్జ్ తమిలి రాజును పరిచయం చేశారు.
బిగ్ బాస్ లోకి పంపిస్తానని రూ.5 లక్షల మోసం
బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించాడు. ఈ మేరకు గత ఏడాది జూన్ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు. ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి తనను మోసం చేస్తూ వచ్చాడని స్వప్న పోలీసుల ఎదుట వాపోయింది. చివరిగా డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగ్గా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్ది రోజుల కిందట స్వప్న ఓ వీడియోను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.