Cyber Crime : ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ మేసెజ్, ఇన్వెస్ట్ చేస్తే రూ.33 లక్షలు మాయం
04 February 2024, 19:38 IST
- Cyber Crime : అధిక లాభాలు ఆశ చూపి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో హైదరాబాద్ అమీన్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలంటూ సైబర్ మోసాలు
Cyber Crime : నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో ఓ వ్యక్తి రూ. 33 లక్షలు పోగొట్టుకున్న సంఘటన హైదరాబాద్ అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..... అమీన్ పూర్ పరిధిలోని పీజేఆర్ ఎంక్లేవ్ కు చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. సదరు వ్యక్తికి గత డిసెంబర్ 21 తేదీన ట్రేడింగ్ కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ లో అకౌంట్ తెరవడం కోసం తన వ్యక్తిగత వివరాలను యాప్ లో నమోదు చేశాడు. దీంతో సైబర్ నేరగాడు ఒక ఐడీని క్రియేట్ చేసి ఇచ్చాడు. దీంతో ఈ వ్యక్తి నగదును ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. దుండగుడు బాధితుడికి గత కొన్ని రోజులుగా కమిషన్ చూపిస్తూ వచ్చి తన వద్ద ఉన్న మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయాలని, అలా చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆ అపరిచితుడి మాటలు నమ్మిన బాధితుడు తన వద్ద ఉన్న మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసి....కమిషన్ ఎక్కడ అని నిలదీశాడు. నిందితుడు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మరో మోసం-ఐదుగురు అరెస్ట్
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఆశ చూపి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్ బాగ్ లోని సీసీఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ సీపీ రంగనాథ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ కు చెందిన యువతి తమ ఆస్తులు అమ్మగా వచ్చిన రూ.3.16 కోట్లను ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టింది. యువతి ఇలా ట్రేడింగ్ చేస్తున్న క్రమంలో దుబాయ్ నుంచి ఓ వ్యక్తి బాధితురాలికి కాంటాక్ట్ అయ్యి తాము చెప్పినట్టు పెట్టుబడులు పెడితే 30 శాతం పెట్టుబడులు వస్తాయని చెప్పడంతో ఆ యువతి తన దగ్గర ఉన్న పూర్తి డబ్బును ఆ వ్యక్తి చెప్పినట్టు పెట్టుబడి పెట్టింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇలాంటి కేసులో గతంలో ఒకరిని అరెస్ట్ చేశామని...... తాజాగా అదే ముఠాకు చెందిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బును దుబాయ్ కు పంపి హవాల్ ద్వారా తిరిగి ఇండియాకు తెప్పించుకుంటున్నారని ఆయన తెలిపారు. మీట్ తిమ్మినియా, బ్రిడ్జెస్ పటేల్, హర్ష పాండ్యా, శంకర్ లాల్ అనే ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించామని, వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
పార్ట్ టైమ్ జాబ్స్ పేరిట మోసాలు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ప్రజల్ని బురిడీ కొట్టించి డబ్బులు దోచేయాలనే ఉద్దేశంతో పూటకో కొత్త ఐడియా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను శనివారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్ టైమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అవకాశం కల్పిస్తామని ఓ ముఠా నమ్మించింది. ఆ తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని బెదిరిస్తూ వారిని నుంచి డబ్బులు వసూలుకు పాల్పడింది. ఈ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్‌లోని సూరత్‌లో అదుపులోకి తీసుకున్నారు. డేటా ఎంట్రీ పేరుతో ఈ గ్యాంగ్ ఉద్యోగులకు లాగిన్ ఐడీ ఇచ్చి పనిచేయమని చెబుతోంది. అయితే తాము చెప్పిన విధంగా పనిచేయలేదని, కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని ఉద్యోగులకు ఫేక్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడుతుంది. ఆ తర్వాత బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. ఇలా చాలా మందిని మోసం చేసిన ఎవరూ బయటకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఫేక్ నోటీసులకు భయపడి ఏకంగా రూ.6.17 లక్షలు చెల్లించింది. చివరకు మోసపోయామని తెలుసుకున్న ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆరా తీసిన పోలీసులకు.. ఈ ముఠా వ్యవహారం తెలిపింది. దీంతో రంగంలోకి శనివారం నలుగురి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాపై మొత్తం 350కి పైగా కేసులు ఉండగా, తెలంగాణలోనే 28 ఉన్నట్లు పోలీసులుగు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా