తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం, క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు సూసైడ్!

Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం, క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు సూసైడ్!

17 February 2024, 17:29 IST

google News
    • Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. కీసర పీఎస్ పరిధిలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రెడిట్ కార్డు అప్పు కట్టలేక వీళిద్దరూ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు సూసైడ్
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు సూసైడ్ (Pixabay)

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు సూసైడ్

Hyderabad Crime : క్రెడిట్ కార్డు... అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే విలువైన కార్డు. క్రెడిట్ కార్డు(Credit Card)తో తీసుకున్న అప్పు సమయానికి తిరిగి చెల్లిస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ టైం దాటిందంటే వడ్డీ భారం పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు అప్పులు కట్టలేక హైదరాబాద్ లో ఓ జంట తీవ్ర నిర్ణయానికి పాల్పడింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. కీసర పీఎస్ పరిధిలోని నివాసం ఉంటున్న సురేష్ కుమార్, అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు అప్పులతో పాటు బయట కూడా సురేష్ అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు పిల్లలను భాగ్య తన అమ్మ గారింటికి పంపించింది. ఈ ఘటనపై సమాచారం అందకుున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంతో పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు.

రూ.200 కోసం గొడవపడి స్నేహితుడి హత్య

హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ల మధ్య రూ.200 కోసం జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేట్ ఆదిత్య నగర్ కు చెందిన ఆస్కార్, షాజన్ బేగం దంపతుల కుమారుడు గచ్చిబౌలిలోని ఓ మాల్ లో పని చేసేవాడు. కొద్దిరోజుల క్రితమే పని మానేసిన బాలుడు జులాయిగా తిరుగుతున్నాడు. ఈనెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈనెల 16న హఫీజ్ పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని బాలుడు పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతను అదృశ్యమైన బాలుడిగా గుర్తించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారణలో భాగంగా మృతుడు స్నేహితుడిపై అనుమానం రావడంతో....బాలుడి స్నేహితుడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అదే ఆదిత్య నగర్ ప్రాంతానికి చెందిన మరో బాలుడు మృతుడితో పాటు కొన్ని రోజులుగా గచ్చిబౌలి లోని ఓ మాల్ లో హౌస్ కీపింగ్ పనిచేశాడు. ఈనెల 14న సాయంత్రం వీరి ఇద్దరూ కలిసి స్థానిక వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి కిందికి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య రూ. 200 విషయంలో గొడవ జరిగింది. దీంతో బాలుడిపై మరో బాలుడు బలంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం మద్యం మత్తులో పక్కనే ఉన్న బండ రాయితో బలంగా తలపై బాది అక్కడి నుంచి పరారైనట్లు అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో జువెనైల్ జైలు తరలించినట్లు తెలిపారు.

తదుపరి వ్యాసం