Alishetty Arvind Arrest : మిడ్ డే మీల్స్ టెండర్ పేరిట చీటింగ్, ఫోర్జరీ సంతకాలతో ఫేక్ జీవోలు- బీఆర్ఎస్ కీలక నేత అరెస్టు
10 January 2024, 19:54 IST
- BRS Alishetty Arvind Arrest : మిడ్ డే మీల్స్ పథకానికి సరుకులు, డ్రై రేషన్ సప్లై కాంట్రాక్టు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని మోసం చేశాడు బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్. సీసీఎస్ పోలీసులు అరవింద్ ను అరెస్టు చేశారు.
అలిశెట్టి అరవింద్
BRS Alishetty Arvind Arrest : మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించి సరుకుల సప్లై, డ్రై రేషన్ సప్లై కాంట్రాక్టులు నీకే ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యాపారి వద్ద రూ 4.5 కోట్లు వసూలు చేసిన బీఆర్ఎస్ నేత అరవింద్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడు అరవింద్ సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఫోన్ లో ఉన్న ముఖ్య నేతలతో ఉన్న ఫొటోలను సీసీఎస్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ స్కాంలో ఇతర నాయకులకు, ఎమ్మెల్యేల హస్తం ఉందా? అనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్డు నంబర్ 73లో నివాసం ఉండే బొల్లినేని ధనుష్ శ్రీనివాస్ ( 30)కు హైదరాబాద్ , బెంగళూరులో వివిధ వ్యాపారాలు ఉన్నాయి. 2021 డిసెంబర్ లో తన సోదరుడు కార్తీక్ ద్వారా అలిశెట్టి అరవింద్ అనే వ్యక్తి శ్రీనివాస్ కు పరిచయం అయ్యాడు. కాకతీయ హిల్స్ కు చెందిన అలిశెట్టి అరవింద్, తాను బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా శ్రీనివాస్ తో చెప్పుకున్నాడు. పార్టీలో ముఖ్య నాయకులకు, మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడిగా పరిచయం చేసుకున్నాడు. పలు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫోటోలను శ్రీనివాస్ కు చూపించాడు. తనకున్న పరిచయాలతో పలుమార్లు ప్రభుత్వ ఆఫీసుకు శ్రీనివాస్ ను తీసుకెళ్లి మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించిన అధికారులను వ్యాపారి శ్రీనివాస్ కు పరిచయం చేసి, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో అమలు చేస్తున్న మిడ్ డే మీల్స్ కి ప్రాజెక్టులో టెండర్ ఇప్పిస్తానని నమ్మించాడు. వీటితో పాటు రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను సప్లై చేసే బిజినెస్ కు అనుమతులు ఇప్పిస్తానని చెప్పాడు .ఈ క్రమంలో అనేకసార్లు శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. సంబంధించిన అధికారులతో మీటింగ్ పెట్టిస్తారని నమ్మించాడు. సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సంతకాలతో తయారు చేసిన ఫేక్ జీవోలను శ్రీనివాస్ కు చూపించాడు. 2022 ఫిబ్రవరి 16న రూ. 50 లక్షలు శ్రీనివాస్ దగ్గర నుంచి వసూలు చేశాడు.
డ్రైరేషన్ సప్లైకి అనుమతులోచ్చాయని నమ్మించి రూ.4 కోట్లు
డ్రై రేషన్ సప్లై చేసేందుకు కూడా అనుమతులు వచ్చాయని నమ్మించి శ్రీనివాస్ నుంచి మరో నాలుగు కోట్లు వసూలు చేశాడు. ప్రముఖ నేతలు, అధికారుల అండదండలు ఉంటాయని చెప్పాడు. అయితే రెండేళ్లు గడిచినా, ఎలాంటి ప్రాజెక్ట్ ఆర్డర్స్ రాకపోవడంతో శ్రీనివాస్ కు అరవింద్ పై అనుమానం వచ్చింది. గచ్చిబౌలిలోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో మిడ్ డే మీల్స్ ప్రాజెక్ట్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరాడు. ఈ క్రమంలోనే అరవింద్ చీటింగ్ బట్ట బయలు అయింది. ప్రాజెక్టు రిపోర్ట్ పర్మిషన్స్ ఇతర డాక్యుమెంట్లను అరవింద్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన వ్యాపారి శ్రీనివాస్....డిసెంబర్ 4న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ను మంగళవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా