తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pallavi Prashanth : చంచల్ గూడ జైలు నుంచి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదల

Pallavi Prashanth : చంచల్ గూడ జైలు నుంచి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదల

23 December 2023, 20:47 IST

google News
    • Pallavi Prashanth : బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ శనివారం రాత్రి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
పల్లవి ప్రశాంత్
పల్లవి ప్రశాంత్

పల్లవి ప్రశాంత్

Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ శనివారం రాత్రి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. బిగ్ బాస్ ఫైనల్ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ తమ్ముడు, స్నేహితుడ్ని కూడా అరెస్టు చేశారు. పల్లవి ప్రశాంత్ లాయర్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ముందుగా నాంపల్లి హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టిపారేసింది. రెండోసారి దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించి పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చింది. ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలు అధికారులు ప్రొసెస్ పూర్తి చేసి పల్లవి ప్రశాంత్ ను శనివారం జైలు నుంచి విడుదల చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యే సమయంలో కొందరు అభిమానులు మరోసారి జైలు దగ్గరకు చేరుకుని హల్ చల్ చేశారు.

షరతులతో కూడిన బెయిల్

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍కు శుక్రవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణకు కారణమయ్యాడనే కేసులో అరెస్టైన ప్రశాంత్ కు ఊరట దక్కింది. పల్లవి ప్రశాంత్ పిటిషన్‍పై నిన్న నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. బెయిల్ ఇస్తూ కొన్ని షరతులను విధించింది. విచారణ కోసం ఆదివారం మళ్లీ పోలీసుల ముందుకు వెళ్లాలని పల్లవి ప్రశాంత్‍ను న్యాయస్థానం ఆదేశించింది. రూ.15 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను ఇవ్వాలని సూచించింది. దీంతో శనివారం రాత్రి చంచల్‍గూడ జైలు నుంచి ప్రశాంత్ విడుదల అయ్యారు.

అసలేం జరిగింది?

గత ఆదివారం (డిసెంబర్ 17) బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ గ్రాండ్ ఫినాలే పూర్తైన తర్వాత హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ బయట గొడవ జరిగింది. ఈ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, రన్నర్‌గా నిలిచిన అమర్ దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా కొందరు ఇతర కంటెస్టెంట్ల వాహనాలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలను పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు ధ్వంసం చేశారని కేసు నమోదైంది. అక్కడి నుంచి హడావుడి లేకుండా వెళ్లాలని పోలీసులు చెప్పినా.. పల్లవి ప్రశాంత్ వినిపించుకోలేదని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. పల్లవి ప్రశాంత్ హంగామా చేయడం వల్ల అల్లర్లు ఎక్కువయ్యాయని పోలీసులు చెప్పారు. ఈ అల్లర్ల కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్‍ను రెండు రోజుల క్రితం డిసెంబర్ 20న జూబ్లిహిల్స్ పోలీసులు.. అతడి స్వగ్రామమైన కొలుగూరులో అరెస్ట్ చేశారు. అతడి సోదరుడితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

తదుపరి వ్యాసం