BRS Weds BJP : బీఆర్ఎస్, బీజేపీ లగ్గం- పెండ్లి కార్డుతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం
25 October 2023, 18:10 IST
- BRS Weds BJP : రాజకీయ బాగోతమేసే వారి ఇంట బీఆర్ఎస్, బీజేపీ పెండ్లి అంటూ కాంగ్రెస్ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ లగ్గం పిలుపు పేరుతో పెండ్లి కార్డు విడుదల చేసింది.
బీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ సెటైర్లు
BRS Weds BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారాలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది. బీజేపీ- బీఆర్ఎస్ ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంది. కేసీఆర్ ఫాంహజ్ లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రికలో పేర్కొంది. ముహూర్తం 2023 ఎన్నికల్లో.. నక్షత్రం కవితపై కరుణ నక్షత్రంలో అంటూ వినూత్నంగా పెండ్లి పత్రిక ముద్రించింది.
- లగ్గం వేడుక : రాజకీయ బాగోతమేసే వారి ఇంట
- లగ్గం యాడనో ఎర్కన? కేసీఆర్ ఫామ్ హౌస్ లో
- అర్సుకునేటోళ్లు: కేటీఆర్, హారీశ్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, అర్వింద్
- ముహూర్తం: 2023 సార్వత్రిక ఎన్నికల్లో
- నక్షత్రం: కవితపై కరుణ నక్షత్రంతో
- పిలిశెటోళ్లు: మోదీ, కేసీఆర్ & తెలంగాణ మంత్రులు
- మెదటి అడుగు: నోట్ల రద్దుతో ఒకరికి ఒకరు మద్దతు
- రెండో అడుగు: కాళేశ్వరం కుంభకోణానికి మోదీ అండ
- మూడో అడుగు: పెట్రోల్, డిజీల్, గ్యాస్ పై ట్యాక్స్ ల కుంభకోణం
- నాలుగో అడుగు: ధరణితో తెలంగాణల భూముల కుంభకోణం
- ఐదో అడుగు: లక్ష ఉద్యోగాలని కేసీఆర్.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోదీల నయవంచన
- ఆరో అడుగు: పేపర్ లేకేజీపై సీబీఐ ఎంక్వైరి వేయకపోవడం
- ఏడో అడుగు: బండి సంజయ్ అధ్యక్ష పదవి పీకేసి కిషన్ రెడ్డి చేతిలో పెట్టడం
ఇంతకీ బీఆర్ఎస్ కి బీజేపీ ఇస్తున్న కట్నం ఎంతో తెలుసా? లిక్కర్ స్కాంలో కవితమ్మను అరెస్టు కాకుండా అభయం అంటూ సెటైర్లు వేసింది. బీఆర్ఎస్, బీజేపీ మిత్రుల అభినందనలతో పెళ్లికి ఆహ్వానం పలికింది కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ బీఆర్ఎస్-బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ పరోక్షంగా సాయం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. అందుకే బండి సంజయ్ ను తప్పించి, బీఆర్ఎస్ కు మేలు చేసేందుకు కిషన్ రెడ్డిని నియమించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు, ఈడీ విచారణ అంతా సద్దుమణగడానికి బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందమే కారణమంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది.