Revanth Reddy :అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తాం - రేవంత్ రెడ్డి
08 May 2023, 19:57 IST
- Revanth Reddy : తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి గుర్తింపు కార్డులు అందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.
రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో మాట్లాడిన ఆయన... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు
తెలంగాణలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ ఆరేళ్లపాటు ఒక్క ఉద్యోగం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు సరైన న్యాయం జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను అమలుచేస్తామన్నారు. ఐదు శీర్షికలలో యూత్ డ్లికరేషన్ ప్రవేశపెడుతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర్య సమర యోధులుగా గుర్తించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు పింఛన్ అందిస్తామన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామన్నారు. ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు.
నయా ఇందిరమ్మ
ప్రియాంక గాంధీని నయా ఇందిరమ్మ అంటూ రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇందిరా గాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. ఇందిరా గాంధీ వల్లే బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్ లాంటి సంస్థలు వచ్చాయన్నారు. 1980లో ఇందిరమ్మ దయతో తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందన్నారు. ఇందిరమ్మ మనుమరాలు ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు అండగా నిలబడతానని మాట ఇచ్చారన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ఆత్మ గౌరవ ప్రతీకలు అన్నారు. తెలంగాణ పౌరుషానికి ఆ యూనివర్సిటీలు వేదికలు అన్నారు.
మన రాష్ట్రం-మన కొలువులు
మన రాష్ట్రం-మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి పోరాడారని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆత్మబలిదానాలకు కూడా భయపడలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 5.35 లక్షల ఉద్యోగాలు కేటాయించారని, వీటిలో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఆరేళ్ల పాటు ఒక్క ఉద్యోగం కూడా భర్తీచేయలేదన్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు హైదరాబాద్ యూత్ డిక్టరేషన్ ను ప్రవేశపెడుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.