Podu Land Titles : గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ఈ నెల 30 నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ
24 June 2023, 16:45 IST
- Podu Land Titles : ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్
Podu Land Titles : తెలంగాణ వ్యాప్తంగా జూన్ 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి జూన్ 30న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే ఈనెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత ఈనెల 30 తేదీకి మార్చారు. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29న బక్రీద్ పండుగ కూడా ఉండడం...వీటంన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30కి మార్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 30న నూతనంగా నిర్మించిన అసిఫాబాద్ జిల్లా కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అటవీ అధికారులు, రైతులకు మధ్య వివాదం
తెలంగాణలోని సుమారు 11 జిల్లాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ పోడు వ్యవసాయం(Podu Cultivation) చేస్తున్న వారు ఉన్నారు. కొన్నేళ్లుగా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. హరితహారం పథకంతో అటవీ భూముల్లో ప్రభుత్వం మెుక్కల పెంపకం చేపడుతోంది. ఫలితంగా అటవీ అధికారులు, పోడు వ్యవసాయం చేసే రైతులకు మధ్య వివాదం నడుస్తుంది. భూహక్కు పత్రాలు ఉన్న భూములను వదిలేసి.. మిగతా ప్రాంతాల్లో మెుక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నారు. తాము పోడు చేసుకుంటున్న భూముల్లో మెుక్కలు నాటుతున్నారని గిరిజనులు అంటున్నారు.
రాతపూర్వక హామీ
రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి రెండు వేల 845 గ్రామపంచాయతీల నుంచి 4 లక్షల 14 వేల 353 దరఖాస్తుల వరకూ ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూమి చూసుకుంటే.. 12 లక్షల 46 వేల 846 ఎకరాలుగా ఉంది. ఆ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కసరత్తు నడుస్తోంది. ఇదే అంశంపై అసెంబ్లీలో స్పందించిన సీఎం కేసీఆర్… 11 లక్షల ఎకరాలకుపైగా పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులను నరకవద్దని… పోడు వ్యవసాయ విషయంలో రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేయకపోతే పట్టాలు పంపిణీ చేయమని స్పష్టం చేశారు. అయితే తాజాగా జూన్ 30 నుంచి పట్టాల పంపిణీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో… సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.