CM KCR : దేశం తెలంగాణ మోడల్ ను కోరుకుంటుంది, వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు గెలుస్తాం- సీఎం కేసీఆర్
18 May 2023, 10:47 IST
- CM KCR : తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్
CM KCR : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసింది చెప్పుకుంటే చాలని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్లలో ఏం చేశామో జనాలకు చెప్పాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టాలని సూచించారు. చెరువు గట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలన్నారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదన్న కేసీఆర్.. హస్తం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ 105 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని సూచించారు.
దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లలో సాధించిన ప్రగతిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా మారిందన్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందామన్నారు. సొంత రాష్ట్రం సాధించుకుని ప్రగతి వైపు పరుగులు పెడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎలా ఉన్న తెలంగాణ ఎలా అయిందో ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు సహా అన్ని స్థాయిల నేతలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
అదే బీఆర్ఎస్ విజయ రహస్యం
తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తాను చెప్పినట్లు చేస్తే ప్రతి ఒక్కరికీ 50 వేల కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కులం, మతంపై ఏ పార్టీ గెలవదన్న కేసీఆర్....అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడమే బీఆర్ఎస్ విజయ రహస్యమన్నారు. తెలంగాణ వజ్రపు తునక అయితే ఇవాళ ఏపీ పరిస్థితి ఏంటో తెలుసన్నారు. సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటామంటే మోదీ ఇవ్వటంలేదన్నారు. గుజరాత్ మోడల్ బోగస్ అని, దేశం తెలంగాణ మోడల్ కోరుకుంటోందన్నారు.