Mynampally Issue : మైనంపల్లిపై వేటు తప్పదా? క్రమశిక్షణా చర్యలకు బీఆర్ఎస్ నేతలు డిమాండ్
22 August 2023, 15:59 IST
- Mynampally Issue : ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడిన మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి
Mynampally Issue : మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సహా నేతలు ఖండించారు. మైనంపల్లిపై వేటు పడే అవకాశం ఉందని పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. మైనంపల్లి మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ తెలిపారు. బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన హరీశ్ రావుపై మైనంపల్లి విమర్శలు సరికాదన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న నాయకుడు హరీశ్ రావు అన్నారు. కానీ రాజకీయ హోదాలో, పార్టీలో ఉండి పార్టీ లైన్ దాటి మాట్లాడటం మంచిది కాదని మైనంపల్లికి హితవు పలికారు. పార్టీ అధిష్టానం కచ్చితంగా హన్మంతరావుపై చర్యలు తీసుకోవాలని భాను ప్రసాద్ కోరారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుమలలో మైనంపల్లి ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. మైనంపల్లి గత చరిత్ర అందరికీ తెలుసని, ఆయన స్థాయి తెలుసుకొని మాట్లాడాలన్నారు.
మైనంపల్లిపై చర్యలకు డిమాండ్
తిరుమల వేదికగా, దేవుడు సాక్షిగా గుడి ముందు హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు సరికాదని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ నేత ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. ఒక రౌడీ లాగా, బెదిరించే ధోరణిలో మైనంపల్లి మాట్లాడారన్నారు. మైనంపల్లి పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. హరీశ్ రావుకు, పార్టీకి మైనంపల్లి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ విషయంపై పార్టీ సెక్రెటరీ జనరల్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.
వేటు తప్పదా?
తిరుమలలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు... మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలంకలం రేపుతున్నాయి. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. మైనంపల్లి పార్టీ లైన్ దాటి మాట్లాడారని ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. పోటీ చేయడం, చేయకపోవడం ఇకపై ఆయన ఇష్టం అని స్వయంగా కేసీఆరే అన్నారు. అయితే మల్కాజిగిరి, మెదక్ రెండు సీట్లు కేటాయిస్తేనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని, లేదంటే స్వతంత్రులుగా బరిలో దిగుతామని మైనంపల్లి స్పష్టం చేశారు. ఈ తరుణంలో మైనంపల్లిపై చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్లు ఆశించిన చాలా మంది నేతలు టికెట్లు దక్కకపోయేసరికి వాయిస్ పెంచుతున్నారు. పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఇతర నేతల బాటలోనే మైనంపల్లి నడుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మైనంపల్లి ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.