Hyderabad : డ్రంకన్ డ్రైవ్ లో షాకింగ్ ఘటన - బ్రీత్ అనలైజర్ ను ఎత్తుకెళ్లిన మందుబాబు, చివరికి దొరికిపోయాడు..!
03 July 2024, 16:52 IST
- Drunk driving checks in Hyderabad : హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు డ్రంక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఓ మందుబాబు ఏకంగా బ్రీత్ అనలైజర్ ను ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బోయిన్ పల్లి పోలీసులు… నిందితుడిని అరెస్ట్ చేశారు.
బ్రీత్ అనలైజర్ ను ఎత్తుకెళ్లిన మందుబాబు, చివరికి దొరికిపోయాడు
Drunk driving checks in Hyderabad : డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ మందుబాబు చుక్కలు చూపించాడు. ఏకంగా పరీక్షలు నిర్వహించే… బ్రీత్ అనలైజర్ నే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.
బోయిన్ పల్లి పోలీసులు వివరాల ప్రకారం…. జూన్ 27వ తేదీన రాత్రి బోయిన్‌పల్లిలోని పుల్లారెడ్డి బిల్డింగ్ ట్రాఫిక్ పాయింట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సమయంలోనే కొత్తపల్లి శ్రావణ్ కుమార్(అలియాస్ సన్నీ) అనే వ్యక్తి స్విఫ్ట్ కారులో బోయిన్ పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్నాడు. అతడి వాహనాన్ని నిలిపి టెస్ట్ చేసే క్రమంగా…. బ్రీత్ అనలైజర్ ను లాకొక్కని కారు వేగంగా ముందుకు తీసుకెళ్లి పారిపోయాడు.
షాకైన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కారు వివరాలను సేకరించారు. ఐపీసీ 353, 356, 379 సెక్షన్ కింద కేసు(Cr no 409/2024) నమోదు చేశారు. నిందితుడికి కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు కేసును చేధించారు.
రంగంలోకి దిగిన బోయిన్ పల్లి పోలీసులు శ్రావణ్ కుమార్‌ను పట్టుకున్నారు. బ్రీత్ అనలైజర్ తో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని కియా స్టోర్ కు దగ్గరలోని తారక కాలనీలో శ్రావణ్ నివాసం ఉంటున్నాడు. 27 ఏళ్ల శ్రావణ్ ది తెలంగాణలోని రామగుండం ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.