తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Abdullapurmet Murder: అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్యను తలనరికి చంపిన భర్త

Abdullapurmet Murder: అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్యను తలనరికి చంపిన భర్త

Sarath chandra.B HT Telugu

17 January 2024, 8:22 IST

google News
    • Abdullapurmet Murder: అబ్దుల్లాపూర్‌మెట్‌ జేఎన్‌యూఆర్‌ఎం కాలనీలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి భార్య  తల నరికి చంపాడు.
అబ్దుల్లాపూర్‌ మెట్‌లో భార్య తల నరికి చంపిన భర్త
అబ్దుల్లాపూర్‌ మెట్‌లో భార్య తల నరికి చంపిన భర్త (Pixabay)

అబ్దుల్లాపూర్‌ మెట్‌లో భార్య తల నరికి చంపిన భర్త

Abdullapurmet Murder: హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.అనుమానంతో పాటు కుటుంబ కలహాలు నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా భార్య తల,మొండెం వేరు వేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్ బి నగర్ కు చెందిన విజయకుమార్, పుష్పవతి (41) దంపతులు. వీరికి ఓ కుమార్తె ఓ కుమారుడు ఉన్నారు. భార్య,భర్తల మధ్య గత కొంత కాలంగా మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం పుష్పవతి తన కూతురుతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలోని 5/13 బ్లాక్ లో నివాసం ఉంటోంది.

కుమారుడుతో కలిసి ఎల్బీనగర్ లో ఉంటున్న విజయకుమార్ అప్పుడప్పుడు భార్య కూతురు వద్దకు వస్తుండే వాడు. ఈ క్రమంలోనే జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన నూతన భవన సముదాయంలోని 667 బ్లాక్ లో తన సోదరికి ఇల్లు వచ్చిందని భార్యకు చెప్పాడు.

ఆ ఇంటిని శుభ్రం చేసి వద్దామంటూ మంగళవారం భార్య పుష్పవతి వద్దకు వచ్చాడు. పుష్పవతిని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ముందస్తు పథకం ప్రకారం… తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో పుష్పవతిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తల,మొండెం వేరుచేసి పరారయ్యాడు.

పథకం ప్రకారమే.....

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసిపీ భీంరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సిఐ కరుణాకర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పరిశీలించి అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు.

పోస్ట్ మార్టం నిమిత్తం మృతి దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళ వారం మధ్యాహ్నం 2:30 గంటలకు సంఘటన జరిగిన వెంటనే పురానపూల్‌‌లో నివాసం ఉండే పుష్పవతి తల్లితండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

హత్య సమాచారం అందిన నాలుగైదు గంటలైనా వారు రాక పోవడంతో మృతురాలికి తన తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు విజయ్ కుమార్ ను అదుపులో తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

తదుపరి వ్యాసం