Siricilla Poachers: నాటు బాంబులతో వన్య ప్రాణులను వేటాడే ముఠా గుట్టురట్టు…ఇద్దరి అరెస్ట్
23 September 2024, 5:28 IST
- Siricilla Poachers: నాటు బాంబులు ఉపయోగించి వన్యప్రాణులను వేటాడే ముఠా గుట్టు రట్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ముఠాకు చెందిన ఇద్దరిని ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి 25 నాటు బాంబులు, ఐదు నైలాన్ వలలు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
నాటు బాంబులతో జంతువుల వేటాడుతున్న వ్యక్తి అరెస్ట్
Siricilla Poachers: సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన మొగిలి అంజయ్య , కామారెడ్డికి చెందిన మానేపల్లి చంద్రకళ, కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన పిట్టల రాజలింగం ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మొగిలి అంజయ్య మేకలు కాచుకుంటూ పందులను సాదుకుంటూ జీవిస్తు పెంచుకున్న పందుల మాంసాన్ని అమ్ముకునేవారు.
చుట్టుపక్కల గ్రామాలలో పంట పొలాలకు అడవి జంతువుల నుండి రక్షణగా రాత్రిపూట ఉంటూ సర్దాపూర్ గుట్టలో, చుట్టుప్రక్కల గ్రామాలలో అడవి జంతువులు చాలాసార్లు కనిపించగా వాటిని ఎలాగైనా వేటాడి చంపి వాటి మాంసం అమ్మి డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకుని తన దగ్గర ఉన్న వలలతో అడవి పందులను పట్టి చంపి వాటి మాంసంను అవసరం ఉన్నవారికి అమ్మేవాడు.
కామారెడ్డి టూ సిరిసిల్ల…
గతంలో తనకు పరిచయస్తుడైన ధర్మారంకు చెందిన పిట్టల రాజలింగం నాటు బాంబులు తయారు చేసి వాటితో అడవి జంతువులను సులువుగా వేటాడి వాటి మాంసాన్ని అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడాన్ని చూసి తనకు కూడా నాటు బాంబులు కావాలని అడగగా నాటు బాంబులు తయారు చేయడానికి కొన్ని రసాయన పౌడర్లు అవసరం అవుతాయని వాటిని కామారెడ్డికి చెందిన మానేపల్లి చంద్రకళ అమ్ముతుందని తెలుపగా సంవత్సరం క్రితం చంద్రకళ ధర్మారం గ్రామానికి రాగా తను ఆమెను కలిసి 1500 రూపాయలు ఇచ్చి నాటుబాంబులు తయారు చేయుటకు వాడే ముడి పరికరాలు కొనుకొని ,ఆ తర్వాత చంద్రకళను పోలీసు వారు పట్టుకున్నారని తెలిసి తను కొన్న మూడు రకాల పౌడర్లను తన ఇంటిలో ఎవరికి తెలియకుండా దాచి పెట్టారు.
వలలతో అడవి పందులను పట్టుకోవడం కష్టం అవుతుండడంతో తన దగ్గర ఉన్న పౌడర్లతో నాటు బాంబులు తయారు చేయించాలని ధర్మారం గ్రామంలోని పిట్టల రాజలింగం వద్దకు వెళ్లి అడుగగా రాజలింగం నాటుబాంబులు తయారుచేసి కొన్నింటిని మొగిలి అంజయ్యకు ఇచ్చి మరికొన్ని అతని వద్ద ఉంచుకున్నాడు.
మక్క పిండి అదిమి...అడవి జంతువులకు ఏరగా వేసి...
మొగిలి అంజయ్య నాటుబాంబులకు మక్క పిండిని అద్ది ఎండలో ఎండబెట్టి వాటిని అడవి జంతువులు తిరిగే ప్రదేశాలలో పెట్టగా మక్క పిండి వాసనకు అడవి పందులు వచ్చి నాటుబాంబులను కొరకగా వాటి దవడలు తల పగిలి అక్కడికక్కడే చనిపోయేవి. వాటి మాంసాన్ని కోసి అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేవాడు. అడవి పందుల మాంసానికి పెంచిన పందుల మాంసం కన్నా ఎక్కువ డిమాండ్ ఉండడంతో పెంచుకున్న పందులను కూడా నాటుబాంబులు వేసి వాటి తల దవడలు పగిలిన తర్వాత దానిని సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి తల చెదిరిపోవడంతో సెల్ ఫోన్ లోని ఫోటోలు చూసి అది అడవి పంది అని ప్రజలను నమ్మించి ఎక్కువ ధరకు పెంచుకున్న పందుల మాంసాన్నికూడా అమ్మేవారు.
అలా పేలుడు పదార్థాలతో చేసిన నాటుబాంబులను దారి వెంట వెళ్లే మనుషులు జంతువులు పశువులు ఇతర అడవి మృగాలు తొక్కిన లేదా కొరికిన వాటి ప్రాణాలకు ప్రమాదం ఉండేది.
నేరం అని తెలిసినా...
జంతువుల వేట నేరం అని తెలిసినప్పటికీ డబ్బుల సంపాదన కొరకు నాటుబాంబులను ఉపయోగించి అడవి పందులను వేటాడే వాడు. నాలుగు రోజుల క్రితం తన దగ్గర ఉన్న నాటుబాంబులు అయిపోవడంతో తన దగ్గర ఉన్న మొత్తం పౌడర్లను, కొన్ని దారం ఉండలను తీసుకొని రాజలింగం వద్దకు వెళ్లాడు.
రాజలింగం మూడు పౌడరులను వివిధ మోతాదుల్లో కలిపి పేపర్ ను గోట్టాలుగా మలిచి వాటిలో పౌడర్ మిశ్రమాన్ని పగులు రాళ్ల ముక్కలను వేసి పేపరును మడిచి దాని చుట్టూ దారంతో చుట్టి మొత్తం 67 నాటు బాంబులను తయారు చేశాడు. అందులో 44 బాంబులు ఇచ్చి అతడు బాంబులు తయారు చేసినందుకు అని మిగతా 27 నాటు బాంబులను తీసుకున్నాడని, నాటుబాంబులను తీసుకొని ఇంటికి వచ్చి వాటికి మొక్కజొన్న పిండిని అద్ది ఎండబెట్టాడు.
ఆ తర్వాత వాటిని ఇంట్లో దాచి వాటిలో నుండి 10 నాటుబాంబులను వెంకటాపూర్, హరిదాస్ నగర్, సర్దాపూర్ గుట్టకు అడవిపందుల వేటకు వాడి మాంసాన్ని అమ్మినట్టు, నాలుగు నాటు బాంబులను తను పెంచుకున్న పందులకు వేసి చంపి అడవి పందులని ప్రజలను నమ్మించి వాటి మాంసాన్ని కూడా అమ్మినట్టు పోలీసులకు వివరించాడు.
ధర్మారం గ్రామ శివారులో వివిధ రకాల అడవి జంతువులు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకొని వాటిని నాటు బాంబులతో వేటాడాలని సెప్టెంబర్ 20వ తేదీ తెల్లవారుజామున ఒక నాటుబాంబును తీసుకొని ధర్మారం గ్రామ శివారుకు వెళ్లి నాటు బాంబును అక్కడ వేసి కొద్దిసేపు చూశాడు. దాన్ని జంతువులు కొరకలేదని తిరిగి రాత్రి వరకు ఏదైనా జంతువు కోరికి చనిపోతే దానిని రాత్రి మరలా వచ్చి తీసుకువెళ్లొచ్చని అక్కడి నుండి వచ్చి వెళ్లిపోయాడు.
తిరిగి రాత్రి అక్కడికి వెళ్లగా పెట్టిన నాటుబాంబును మధ్యాహ్నం సమయంలో ఒక గేదె కొరికినందున బాంబు పేలడంతో దాని దవడ పగిలిపోయింది. నాటు బాంబు పెట్టిన వ్యక్తి గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలిసి మొగిలి అంజయ్య తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసులు ఆరా తీసి నిందితుడిని ఇంటి వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు. రాజలింగంను కొనరావుపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు చంద్రకళ పరారిలో ఉన్నారని సిఐ తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)