Kadem Project: కడెం ప్రాజెక్ట్ కు రికార్డు స్థాయిలో వరద - 64 ఏళ్లలో ఇదే తొలిసారి
13 July 2022, 13:03 IST
- kadem project record: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరద నీరు వచ్చి చేరుతోంది. 1995 తర్వాత ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
కడెం ప్రాజెక్ట్
kadem project water levels: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటు గోదావరి, మరోవైపు కృష్ణమ్మ పరగులతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారిపోయాయి. ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ పరిస్థితి చెప్పలేని స్థితికి చేరిపోయింది. ఓ దశలో ఏం జరుగుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. వరద ఉగ్రరూపం దాల్చడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది.
ఇదే తొలిసారి..!
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో 5 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తున్నది. ఫలితంగా 1995 తర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు అంచనా వేస్తున్నారు. సామర్థ్యానికి మించి 2 లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్ రూమ్‌లోకి వరద నీరు చేరింది.
భారీగా వరద వస్తుండటంతో అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొత్తం 18 గేట్లలో ఒక మొరాయించింది. దీంతో 17 గేట్ల ద్వారా వరదను కిందికి విడుదల చేస్తున్నారు. పెద్దఎత్తున నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సీఎం కేసీఆర్ ఆరా...
కడెం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మరోవైపు భైంసా గడ్డేన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 52,100 క్యూసెక్కుల వదర నీరు చేరుతోంది. గడ్డేన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 358.40 అడుగులు ఉంది. ఇక కాళేశ్వరానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పలుచోట్ల పుష్కరఘాట్ లు మునిగిపోయాయి.