YS Sharmila Interview : మాదొక్కటే ప్రాంతీయ పార్టీ.. తెలంగాణ కోసం పోరాడేది మేమే
04 November 2022, 16:07 IST
YSR Telangana Party chief YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందా..? రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్న ఆ పార్టీ అధినేత్రి షర్మిల.. మునుగోడులో ఎందుకు పోటీ చేయలేదు..? పాదయాత్ర ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారు..? అసులు వైఎస్ఆర్టీపీ లక్ష్యమేంటి..? వంటి ప్రశ్నలకు బదులిచ్చారు వైఎస్ షర్మిల. ఆమె చేపట్టిన పాదయాత్ర.. 3 వేల కిలో మీటర్ల మైలురాయికి చేరిన నేపథ్యంలో ఆమెతో హిందుస్థాన్ ట్రైమ్స్ తెలుగు మాట్లాడింది. ఇంటర్వూలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
YSR Telangana Party founder-president YS Sharmila (HT Archives)
Interview With YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావటంమే లక్ష్యంగా జూలై 2021లో పార్టీని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె... సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారంతో ఆమె పాదయాత్ర 3 వేల కి.మీ మైలురాయిని దాటబోతుంది. ఈ నేపథ్యంలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఆమెతో ముఖాముఖి చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు నేపథ్యం, భవిష్యత్తు, మునుగోడు ఉపఎన్నిక, తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల తీరుపై స్పందించారు.
ప్రశ్న : తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా రాజకీయ శూన్యత ఉందనుకుంటున్నారా..? దీన్ని మీరు భర్తీ చేయగలరని భావిస్తున్నారా?
జవాబు : అవును, తెలంగాణలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చింది... ఆయన పనితీరు, పథకాల ఆధారంగా కాదు. ఆయన అధికారంలోకి రావాలని ప్రజలు కూడా కోరుకోలేదు.. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రత్యామ్నాయం కాదని ప్రజలు భావించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ శూన్యతను మేమూ మాత్రమే సంపూర్ణంగా భర్తీ చేస్తామని భావిస్తున్నాను.
ప్రశ్న - మునుగోడులో జరుగుతున్న ఉపఎన్నికలో మూడు పార్టీల మధ్యే పోరు నెలకొంది. మీ పార్టీ ఎక్కడా కనిపంచలేదు..?
జవాబు - మునుగోడులో జరుగుతున్నది కేవలం రాజకీయాలు మాత్రం. వీధి కుక్కల ఫైట్ గా నడుస్తోంది. ప్రజల జీవితాలను మార్చే ఎన్నిక మాత్రం కాదు. వేలాది కోట్ల రూపాయలతో కూడిన ఖరీదైన ఎన్నిక మాత్రమే. మేము దానిలో భాగం కావాలనుకోవటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంలాటి రాజకీయాలను, నాయకత్వాలను ప్రజలు కోరుకోరు. తమ కలలను నిజం చేసే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు కావాలని కోరుకుంటారు. అలాంటి ప్రజల ఆంక్షలను నెరవేర్చడానికే ఇక్కడ నేను ఉన్నాను.
ప్రశ్న - ముఖ్య నేతలతో పాటు కేడర్, సంస్థాగత నిర్మాణం లేకుండా రాజకీయ యుద్ధంలో మీరు ఒంటరిగా ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేదు. ఈ నేపథ్యంలో మీరు వీటిని ఎలా ఎదుర్కొంటారు..?
జవాబు - నేను చాలా పెద్దతలలతో పోరాడుతున్నానేది వాస్తవం. జాతీయ పార్టీలతో పాటు అత్యంత కేడర్ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలలో నేను ఒక చిన్న ప్లేయర్ అనే విషయం నాకు తెలుసు. చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పార్టీని నిర్మించేందుకే ఇక్కడే ఉన్నాను. ప్రజల్లోకి లోతుగా వెళ్తున్నాను. వారితో ఉండేందుకే వచ్చా.. ఈ క్రమంలో వారిని ఒప్పించగల్గితే.. యుద్ధంలో నేను గెలిచినట్లే. అంతిమంగా మనల్ని ఆశీరద్వించేది ఆ దేవుడే.
ప్రశ్న - తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ సాగుతోంది. ఒకవేళ వస్తే ఎదుర్కొనే శక్తి మీ పార్టీకి ఉందా..?
ముందస్తు ఎన్నికలు లేదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలైనా సరే...మేం దాని గురించి ఆలోచించటం లేదు. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు. నేను జూదం ఆడటం లేదు. నేను ఒక నిర్ధిష్టమైన దశలో ఉన్నాను. దీనికంటే దిగువకు వెళ్లే పరిస్థితి లేదు. పైస్థాయికి మాత్రమే వెళ్లగల్గుతామని నమ్ముతున్నాను. దేవుడు మరియు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.
ప్రశ్న - పాదయాత్రలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమిటి?
జవాబు - 8 క్రితం మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ ఇవాళ 4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. మరోవైపు ప్రజల స్థితిగతులు మారలేదు. జీవన ప్రమాణాలు మారలేదు. ప్రభుత్వం ఇచ్చినే అనేక హామీలను నెరవేర్చలేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. రైతుల రుణమాఫీ చేయలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరగలేదు. డబ్బులన్నీ స్వాహా చేశారు. ఇక్కడ అవినీతే ప్రధాన సమస్యగా ఉంది.
ప్రశ్న - మీ పాదయాత్రలో పదేపదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకం. దీన్ని ఎలా చూస్తారు..?
జవాబు - వైఎస్ఆర్ ఇప్పటికీ తెలంగాణకు సంబంధించిన వ్యక్తే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ప్రాంతాల ఆధారంగా వివక్ష చూపలేదు. అయినప్పటికీ... తెలంగాణ ప్రజల పట్ల అత్యంత శ్రద్ద ఉండేది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాలను తీసుకువచ్చారు. ఇవి ప్రధానంగా తెలంగాణ ప్రాంత రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ఆర్ ను తెలంగాణ ప్రజలు కూడా అమితంగా ఆదరించారు. కానీ ఆయన మరణాంతరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు పోరాడారు. పాదయాత్రలో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానం వారి కళ్లలో కనిపిస్తోంది.
ప్రశ్న - వైఎస్ఆర్ వారసత్వం అంటూ తెలంగాణలో పార్టీ పెట్టడానికి మీకు 7 ఏళ్లు ఎందుకు పట్టింది..? దీని వెనక ఏదైనా అజెండా ఉందా?
జవాబు - కేసీఆర్ ఇంతలా విఫలమవుతున్నారని నాకెలా తెలుసు..? ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. పాదయాత్రలో ప్రజలు అనేక విషయాలు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెట్, సున్నీ వడ్డీలు, పంట రుణాల వంటి పథకాలు అందటం లేదని వాపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ప్రజల కలలను నెరవేరుస్తానని చెబుతున్నాను.
ప్రశ్న - మీరు ఏ పార్టీతో పెట్టుకుంటారు..? ఆ అవసరం ఉందని అనిపిస్తుందా..?
జవాబు - తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల తీరుతో నేను నిరాశ చెందాను, ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. తెలంగాణాలో ఇప్పుడు మాది ఒక్కటే ప్రాంతీయ పార్టీ. టీఆర్‌ఎస్ కూడా జాతీయ పార్టీగా మారుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం పోరాడేది నేను మాత్రమే. నేను ఈ ప్రాంత బిడ్డనే. ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుతున్నారు. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. నా గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా తెలంగాణే. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే హక్కు నాకు ఉంది.