Nalgonda Murder: నల్గొండలో పరువు హత్య.. బాలిక కోసం వచ్చిన బాలుడిని కొట్టి చంపేశారు…
26 May 2023, 7:33 IST
- Nalgonda Murder: నల్గొండలో దారుణం జరిగింది. బాలికతో మాట్లాడుతున్నందుకు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలుడిని, బాలిక నాయనమ్మ, తండ్రి కలిసి కర్రలతో కొట్టి చంపేశారు. తమ కుమార్తె వెంట పడొద్దని హెచ్చరించినా వినకుండా వస్తున్నాడనే కోపంతో హతమార్చినట్లు తెలుస్తోంది.
నల్గొండలో దారుణం, బాలికతో మాట్లాడుతున్నాడని కొట్టి చంపేశారు
Nalgonda Murder: తమ కుమార్తెతో మాట్లాడొద్దన్నా వినకుండా వెంట పడుతున్నాడననే కోపంతో బాలిక నాయనమ్మ, తండ్రి కలిసి బాలుడిని కర్రలతో కొట్టి చంపేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి చితకబాదడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు.
పెద్దలు వారించినా వినకుండా ఓ బాలిక వెంటపడటం బాలుడి ప్రాణం తీసింది. తమ కూతురు వెంట పడుతున్నాడన్న కోపంతో రగిలిపోయిన బాలిక తండ్రి కొట్టడంతో బాలుడు చనిపోయాడు.
ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొప్పోలుకు చెందిన బాలిక నల్గొండలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండి పదోతరగతి చదువుతోంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం దుగినెల్లి వాసి, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన బాలుడు ప్రేమ పేరిట ఆమె వెంటపడుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బాలుడు ఇద్దరు స్నేహితులతో కలిసి కొప్పోలుకు వచ్చి బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో మిగిలిన స్నేహితులు ఇంటి వెలుపల ఉన్నారు. వారిని గమనించిన బాలిక నాయనమ్మ ఇంటి బయటి నుంచి తలుపు గడియ పెట్టి తన కుమారుడికి సమాచారం ఇచ్చింది. అది చూసిన స్నేహితులు అక్కడ నుంచి పారిపోయారు. ఆవేశంతో కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్న బాలిక తండ్రి తలుపు తీసి బాలుడిని కర్రలతో తీవ్రంగా కొట్టారు.
తీవ్రగాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ హైస్కూలులో చదివే సమయంలో బాలికతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు బాలుడిని పలుమార్లు హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఆరు నెలల క్రితం షీటీమ్‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని నల్గొండకు పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
ఉపాధి నిమిత్తం బాలుడి తల్లిదండ్రులు సూరత్ వలస వెళ్లారు. సోదరి వద్ద ఉంటున్న బాలుడు, బాలిక వెంటపడటం మానలేదు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హత్య జరిగినట్లు చెబుతున్నారు. మృతుడిని కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్ గా గుర్తించారు. బాలుడిపై దాడి చేసిన బాలిక తండ్రి యాదయ్యతో పాటు ఇతర కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.