Hyd Boy Murder: హైదరాబాద్‌లో కిరాతకం..తండ్రితో వివాదంతో బాలుడి దారుణ హత్య
21 April 2023, 12:32 IST
- Hyd Boy Murder: హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి చిట్టీ డబ్బులు కట్టడం లేదనే అక్కసుతో అతని కొడుకును కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడిని దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసి శవాన్ని నాలాలో పడేశారు.ఈ ఘటనలో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితులు
Hyd Boy Murder: హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. సనత్నగర్లోని అల్లాదున్ కోటిలో బాలుడుని ఓ హిజ్రా బలి ఇచ్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. 8 ఏళ్ల అబ్దుల్ వహీద్‌ను స్థానికంగా నివసించే హిజ్రా కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అమావాస్య రోజున హిజ్రా ఆ బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపించారు.
బాలుడి మృతదేహం వారి సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. దీంతో హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని అల్లాదున్ కోటిలో నివసించే రెడీమేడ్ దుస్తుల వ్యాపారి వసీంఖాన్ కుమారుడిని స్థానికంగా నివసించే ఫిజాఖాన్ అనే ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్ వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బును సకాలంలో ఫిజాఖాన్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గురువారం వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం వసీంఖాన్ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలో ఆడుకుంటున్న సమయంలో అపహరించారు. ఆ తర్వాత అతడిని ప్లాస్టిక్ సంచిలో తీసుకుని ఫిజాఖాన్ ఇంటి వైపునకు తీసుకువెళ్లడం కెమెరాలలో రికార్డ్ అయ్యింది. మరోవైపు బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను గుర్తించారు.
బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో పడేసినట్లు నిందితులు అంగీకరించడంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సాయంతో నాలాలో వెతికారు. ప్లాస్టిక్ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. బకెట్‌ను ప్లాస్టిక్ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో విసిరేసినట్లు గుర్తించారు.
అమావాస్య కావడంతో బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే బాలుడిని హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో హిజ్రాలతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.