CPI Protest at Raj Bhavan : రాజ్‌భవన్ వద్ద హైటెన్షన్.. సీపీఐ నేతల అరెస్ట్
07 December 2022, 12:15 IST
- cpi protest at raj bhavan: హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ నేతలు ఇచ్చిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది.
రాజ్ భవన్ వద్ద సీపీఐ నేతల ఆందోళన
Police Arrested CPI Leaders at Rajbhavan: గత కొంత కాలంగా గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికారపక్షం తీవ్రస్థాయిలో స్పందించింది. ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా గవర్నర్ తీరును తప్పుబట్టాయి. అసలు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఇదే డిమాండ్ తో బుధవారం సీపీఐ పార్టీ... రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది. ఈ క్రమంలో రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఖైరతాబాద్‌కు చేరుకున్న సీపీఐ నేతలు, కార్యకర్తలు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో రాజ్‌భవన్ వైపు వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన కార్యకర్తలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడతో సహా పలువురు సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీపీఐ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకోవడంతో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రాజ్‌భవన్ వైపు వస్తున్న సీపీఐ కార్యకర్తలు, నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
రద్దు చేయాలి - కూనంనేని సాంబశివరావు
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడానికి గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ప్రజాస్వామికవాదులందరూ పాల్గొనాలని.. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ను మించి బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్ధతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని.. ఇందులో గవర్నర్ల పాత్రనే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. నాడు రామారావు ప్రభుత్వంతో పాటు ఇవాళ మహారాష్ట్రలో సర్కార్ పడగొట్టడం వరకు ఇందులో గవర్నర్ల పాత్ర ఉందని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక... సీబీఐ, ఈడీ వంటి సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిందని ఆరోపించారు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పక్కన పెడుతున్నారని కూనంనేని దుయ్యబట్టారు. సమాఖ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. రద్దు అంశంపై తమ జాతీయ సమావేశాల్లోనూ తీర్మానం చేశామని కూనంనేని గుర్తు చేశారు.