తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court: వరంగల్‌ వర్ణం షాపింగ్ మాల్‌కు హైకోర్టు షాక్.. కార్పొరేషన్ ఆంక్షలు కొనసాగింపు

TS High Court: వరంగల్‌ వర్ణం షాపింగ్ మాల్‌కు హైకోర్టు షాక్.. కార్పొరేషన్ ఆంక్షలు కొనసాగింపు

HT Telugu Desk HT Telugu

02 February 2024, 11:31 IST

    • TS High Court: గ్రేటర్ వరంగల్ నగరంలోని వర్ణం షాపింగ్ మాల్ కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. షాపింగ్ మాల్ జప్తు చేస్తూ కార్పొరేషన్‌ అధికారుల  ఆదేశాలను సడలించడానికి నిరాకరించింది. 
కార్పొరేషన్‌ అధికారులు షాపింగ్‌ మాల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న దృశ్యం (ఫైల్)
కార్పొరేషన్‌ అధికారులు షాపింగ్‌ మాల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న దృశ్యం (ఫైల్)

కార్పొరేషన్‌ అధికారులు షాపింగ్‌ మాల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న దృశ్యం (ఫైల్)

TS High Court: వరంగల్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించిన మున్సిపల్ ఆఫీసర్లు.. నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించలేదంటూ ఇటీవల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వర్ణం షాపింగ్ మాల్ ఆక్రమణలు కూల్చివేసి, సీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

దీంతో సీజ్ ఆర్డర్ ను తొలగించాలని మాల్ యజమానులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సీజ్ ఆర్డర్ ను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది.షాపింగ్ మాల్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

వరంగల్ చౌరస్తా ప్రాంతంలో దాదాపు ఏడాదిన్నర కిందట వర్ణం షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ బిల్డింగ్ నిర్మాణం కోసం సంబంధిత యజమానులు పార్కింగ్ కు ఇబ్బందులు కలగకుండా స్టిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

టీఎస్ బీపాస్ ద్వారా చేసుకున్న దరఖాస్తు మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుని, 2022 మే నెలలో షాపింగ్ మాల్ ను ఓపెనింగ్ చేసి నడిపిస్తున్నారు. మాల్ నిర్మాణ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

స్టిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్ బిల్డింగ్ కు టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్లాన్ సమర్పించి, ఆ తరువాత ఆ రూల్స్ పాటించకుండానే బిల్డింగ్ నిర్మించారు. స్టిల్ట్ పార్ట్ కు గోడలు కట్టి, అదనంగా సెల్లార్ నిర్మించి షాపింగ్ మాల్ బిజినెస్ నడిపిస్తున్నారు.

ఆక్రమణలు కూల్చివేసిన అధికారులు

ఇటీవల వరంగల్ నగరంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే వర్ణం షాపింగ్ మాల్ కు ఆక్రమణలు తొలగించాల్సిందిగా ముందుగా నోటీసులు ఇచ్చారు.

భవన యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో పలుమార్లు హెచ్చరించారు. ఆ తరువాత కూడా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. జనవరి 23న ఉదయమే టాస్క్ ఫోర్స్, డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ సిటీ ప్లానర్ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో ఆక్రమణలను కూల్చివేశారు. అనంతరం బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్–2019 సెక్షన్ 181(1) ప్రకారం షాపింగ్ మాల్ ను సీజ్ చేసి వెళ్లిపోయారు.

గతంలోనే ఈ షాపింగ్ మాల్ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలతో సంబంధిత యాజమాన్యం అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అప్పటి ప్రజాప్రతినిధి సహకారం వల్లే మున్సిపల్ అధికారులు కూడా ఇన్నిరోజులు యాక్షన్ తీసుకోకుండా ఉండిపోయారని ఆరోపణలు ఉన్నాయి.

కోర్టుకెళ్లిన యాజమాన్యం.. అక్కడా నిరాశే

నిబంధలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఆక్రమణలను తొలగించడంతో పాటు షాపింగ్ మాల్ ను సీజ్ చేయగా సంబంధిత యజమానులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

మాల్ సీజ్ చేయడంపై స్టేటస్ కో విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బల్దియా తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. నిర్మాణ క్రమంలో స్టిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్ అనుమతులు తీసుకున్నారని, ఆ తరువాత ఆక్రమణలు చేసి నిర్మాణం చేపట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందకుండానే బిల్డింగ్ ను వినియోగించు కుంటున్నారంటూ వాదనలు వినిపించారు. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ వాదనలతో హై కోర్టు ఏకీభవించింది. షాపింగ్ మాల్ యాజమానులు సమర్పించిన పిటిషన్లను తప్పు పట్టింది.

నిర్మాణ క్రమంలో అనుమతి పొందిన ప్లాన్ కు విరుద్ధంగా కన్ స్ట్రక్షన్ జరిపారని ధ్రువీకరించింది. కూల్చివేతలు సరైనవేనని మున్సిపల్ అధికారులను సమర్థించింది. ఈ మేరకు షాపింగ్ మాల్ యజమానులు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ విషయంలో తదుపరి చర్య కోసం సెక్షన్ 252 ప్రకారం ఆర్డీఎంఏకు అప్పీల్ చేసుకోవాలని హై కోర్టు సూచించింది. దీంతో వర్ణం షాపింగ్ యాజమాన్యానికి హైకోర్టులోనూ నిరాశే ఎదురైంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం