Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
21 December 2023, 12:19 IST
- Singareni Elections: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది.
సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Singareni Elections: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘానికి నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాది కాలంగా హైకోర్ట్‌లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నిక వివాదం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్టు.. ఇప్పటికే పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత అక్టోబర్‌లో ఎన్నికలను వాయిదా వేసింది.
తెలంగాణలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలంటూ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. తాజాగా యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. ఆపై పిటిషన్‌పై జరిపిన న్యాయస్థానం ఎన్నికలను వాయిదా వేయడానికి సరైన కారణాలు లేవని అభిప్రాయపడింది.
రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాటు వివిధ విభాగాల సమీక్ష జరపాల్సి ఉండటం, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన వనరుల శాఖ కోరింది.
మార్చిలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టిన కార్మిక సంఘాలు ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ తీర్పునిచ్చారు.