Amit Shah Munugodu Tour : అమిత్ షా మునుగోడు టూర్ షెడ్యూల్ ఇదే
18 August 2022, 20:18 IST
- మునుగోడుపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాగైనా ఉపఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. ఇందులో భాగంగా ముఖ్యనేతలంతా నియోజకవర్గానికి రానున్నారు. తాజాగా అమిత్ షా పర్యటన ఖరారైంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ అనుకుంటోంది. ఈనెల 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.
అమిత్ షా ఈ నెల 21న మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మునుగోడుకు వస్తారు.
సాయంత్రం 5గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు అమిత్ షా. ఇదే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. ఆ తర్వాత సభ ముగిశాక.. తిరుగపయనమవుతారు కేంద్రమంత్రి. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. కేంద్ర హోంమత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తుపై దృష్టి పెట్టారు.
మరోవైపు టీఆర్ఎస్ కూడా ఆగస్టు 20న సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేసింది. కనీసం లక్ష మంది హాజరు కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమిత్‌షా సమావేశానికి దాదాపు రెండు లక్షల మందిని సమీకరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
మునుగోడు సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ అని, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సభను తేలికగా తీసుకోవద్దన్నారు.
అమిత్ షా మునుగోడు నియోజకవర్గానికి వస్తున్నట్టుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్ ఇప్పటికే ప్రకటించారు. మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు, ఈ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు కాషాయ పార్టీలో చేరబోతున్నారని తరుణ్ చుగ్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలతో పాటు తెలంగాణలో బీజేపీ ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా అమిత్ షా ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌కు, మునుగోడు సీటుకు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడుకు చెందిన మరికొందరు కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని చెప్పారు.