Telangan Rains: హైదరాబాద్‌లో కుండపోత, నేడు తెలంగాణలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్…
15 July 2024, 9:29 IST
- Telangan Rains: తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో తడిచి ముద్దైంది.
హైదరాబాద్‌లో జలమయమైన రోడ్లపై నీటిని మళ్లిస్తున్న డిఆర్‌ఎఫ్ సిబ్బంది.
Telangan Rains: హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జలదిగ్బంధం ఏర్పడి జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తెలంగాణ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య మారేడ్‌పల్లిలో అత్యధికంగా 75.3 మిమీ, ఖైరతాబాద్‌లో 74 మిమీ, ముషీరాబాద్‌లో 70 మిమీ వర్షపాతం నమోదైంది.
కుండపోత వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తడంతో జిహెచ్‌ఎంసి అధికారులు వాటిని తొలగించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలోని అనేక జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు (30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్ విజయలక్ష్మి అన్ని జోన్ల కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు వెల్డించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు సాయం అందించడానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వర్షానికి సంబంధించిన సమస్యలు, సహాయం కోసం GHMC-DRF 040-21111111, 9000113667 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సైబరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం కురిసిందని, దీంతో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయని పోలీసులు తెలిపారు. భారీ వర్షాలతో రోడ్లు జలమయమైనా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరియు GHMC మాన్‌సూన్ బృందాలు వేగంగా స్పందించడం వల్ల ట్రాఫిక్ సజావుగా సాగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంజనీరింగ్, జిహెచ్‌ఎంసి అధికారులను సమన్వయం చేసుకుని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆదివారంలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. యూసఫ్‌గూడలో 9.8 సెంటిమీటర్లు , మెట్టుగూడలో 8.23, మారే డుపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదయింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూ ర్లో 7.33 సెం.మీ. వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లో 6.8, సికింద్రాబాద్లో 6.03, మల్కాజిగిరిలో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆ జిల్లాలకు ఐఎండి అలర్ట్…
సోమవారం తెలంగాణలోని 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఆదిలాబాద్, హైదరా బాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురం భీం, మహబూబ్న గర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, పెద్ద పల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డిల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.