Telangana Rains Live Updates : భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం
15 July 2022, 9:32 IST
- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద 17 మోటార్లు జలమయం
కన్నెపల్లి పంప్ హౌస్‌లోకి వరద నీరు చేరడంతో 17 బాహుబలి మోటార్ల జలమయమయ్యాయి. బీర సాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పంప్ హౌస్‌లోకి కూడా వరద నీరు చేరింది.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 28,67,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 28,67,650 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు.
అన్నారం సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 11,68,615 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 11,68,615 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్ధ్యం 5.57 టీఎంసీలు.
Kaleshwaram: కాళేశ్వరం వద్ద ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు
కాళేశ్వరం వద్ద 16.650 మీటర్లతో ఉదృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గు ముఖం పడుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి తీరంలోని ఇళ్ళు, షాపుల్లోకి వరద నీరు చేరింది.
గోదావరికి కొనసాగుతున్న వరద
గోదావరికి వరదలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టుకు 4లక్షల18వేల 510 క్యూసెక్కులు వరద వస్తుండగా 36 గేట్లను అధికారులు ఎత్తారు. 4 లక్షల 16 వేల 934 క్యూసెక్కుల నీటికి దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.40 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటినిల్వ 74.506 టీఎంసీలుగా ఉంది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది.
గాలుల తీవ్రతతో హుస్సేన్ సాగర్ లో ఆగిపోయిన బోటు
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో పెద్ద ప్రమాదమే తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్ మధ్యలో ఆకస్మాత్తుగా ఆగింది. నిన్న ఈ ఘటన జరిగింది. దీనిపై ఓ టూరిస్ట్ ట్వీట్ చేశారు. తాజాగా బయటకు వచ్చింది. 60 మంది సందర్శకులతో నిన్న ఓ బోటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లింది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతతో ఇంజిన్ ఆగింది. టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. స్టీమర్ బోట్ల సహాయంతో పెద్ద బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు.
భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం
భద్రాచలంలో రేపటికల్లా నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి నది ఉరకలెత్తుతోంది. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గం.కు 62.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా.. వరద నీటి ప్రవాహం 19.29 క్యూసెక్కులుగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు శిబిరాలకు తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. జనరేటర్లు, ఇసుక సంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నార.
సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
తెలంగాణలో వరద సహాయం, పునరావాస కార్యక్రమాలపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని, ఏ విధమైన భారీ నష్టం జరగలేదన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎస్ అన్నారు.
హెలికాప్టర్ సాయంతో ఇద్దరిని కాపాడిన అధికారులు
గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరినీ హెలికాప్టర్ సాయంతో కాపాడారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెలికాప్టర్ తెప్పించి.. చెన్నూరు సోమన్ పల్లి దగ్గర గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగం కాపాడింది.
రాకపోకలు బంద్…
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటిమట్టం 60.30 అడుగులకు చేరుకోవడంతో సమీపంలోని లోతట్టు కాలనీలను వరద ముంచెత్తింది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో గురువారం రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి వరద ప్రభావం ఎక్కువైన నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం నుంచి కూనవరం, చర్ల వెళ్లే మార్గాల్లో రవాణా నిలిచిపోయింది. ఈరోజు సాయంత్రం నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే జరిగితే భద్రాచలం నుంచి హైదరాబాద్ ప్రధాన రహదారిపై రవాణా నిలిచిపోవడంతోపాటు మన్యం ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే అవకాశముంది.
ఆయా ప్రాజెక్టుల్లోని పరిస్థితి…
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్...
ప్రస్తుత నీటి మట్టం - 1087.3 అడుగులు
టీఎంసీలు - 74.186/ 90.3 TMC
ఇన్ ఫ్లో - 3,64,425c/s
ఔట్ ఫ్లో - 3,58,425 c/s...
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్..
ప్రస్తుత నీటిమట్టం - 145 అడుగులు
టీఎంసీల సామర్థ్యం - 14.7392/ 20.175 TMC
ఇన్ ఫ్లో: 1175494c/s
ఔట్ ఫ్లో: 1206494c/s
ఎత్తిన గేట్లు: 52
కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్
ప్రస్తుత నీటి సామర్థ్యం(అడుగుల్లో) - 686.475/700 అడుగులు
సామర్థ్యం (టీఎంసీల్లో): 4.574/7.603 TMC
ఇన్ ఫ్లో: 193895 c/s
ఔట్ ఫ్లో: 193895 c/s...
ఎత్తిన గేట్లు - 17
పలు ప్రాంతాలకు మంత్రి వేముల
నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్,నగర మేయర్, కమీషనర్,జడ్పీ చైర్మన్, అదనపు కలెక్టర్, నుడా చైర్మన్ లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో,పునరావాస కేంద్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధిలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిజమాబాద్ నగరంలోని బాబాన్ సాహెబ్ పహాడ్, మాలపల్లి, ఇంపీరియల్ గార్డెన్ గుపన్ పల్లి ప్రాంతాలను మంత్రి సందర్శిస్తారు.
మంత్రి ఎర్రబెల్లి సమీక్ష…
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, అంటు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జనగామ కలెక్టరేట్ లో సమీక్షించారు.
ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.
తెగిపోయిన రోడ్లు…
భద్రాచలంకు వెళ్లే మూడు వైపులా తెగిపోయిన రహదారాలు.
కొత్తగూడెం వైపు నుంచి మాత్రం వెళ్లేందుకు అవకాశం.
ప్రస్తుతం నీటి మట్టం 60 అడుగులకు చేరింది.
మత్తడి దూకుతున్న లక్నవరం చెరువు..
పూర్తిగా నిండిన లక్నవరం(laknavaram) చెరువు మత్తడి దూకుతుంది. రామప్ప(Ramappa) సరస్సులో 30 అడుగులకు నీటిమట్టం చేరింది.
3వ ప్రమాద హెచ్చరిక…
భద్రాచలం వద్ద నీటి మట్టం 58.08 అడుగుల మేరకు చేరింది. 17,29,680 Cusecs నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాదం హెచ్చరిక కొనసాగుతోంది. రామాలయం స్నానాల గట్టు నీట మునిగింది.
పటిష్ట చర్యలు…
గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు తరలివస్తోంది. ఇక కడెం ప్రాజెక్ట్ గేట్లన్నీ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఈ రెండు ప్రాంతాల వద్ద అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలన్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
12 జిల్లాలకు రెడ్ అలర్ట్….
red alert for 12 districts in telangana: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రజల్లో ఆందోళన…
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఉత్తర తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచనలతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.
కడెం తెగిపోలేదు.. ఆ వార్తలు నిజం కాదు
కడెం తెగిపోయినట్టుగా ప్రసారం అవుతున్న వీడియోలు వాస్తవం కాదు. డ్యాం బ్రేకయినట్టు ఇంజనీర్ల నుంచి ఎలాంటి సమాచారం లేదని గమనించాలని ఇరిగేషన్ అధికారులు కోరారు.
నెహ్రూ జూపార్కులో భారీగా వరదనీరు
భాగ్యనగరంలో వర్షాలతో రోడ్లపైకి నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ బహదూర్‌పురా నెహ్రూ జూపార్కులో భారీగా వరదనీరు చేరింది. దీంతో సఫారీ పార్కును మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. జంతువులన్ని ఎన్‌క్లోజర్‌లో సురక్షితంగా ఉన్నాయన్నారు. జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: సీఎం కేసీఆర్
వర్షాలతో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. వాతావరణశాఖ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. గోదావరి ఉద్ధృతిపై ఆరా తీశారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా రైళ్లు రద్దు
జులై 14 నుంచి జులై 17 వరకు రైళ్లు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రద్దు చేశారు. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ మెము ప్రత్యేక రైలు, హెచ్.ఎస్.నాందేడ్-మేడ్చల్-హెచ్.ఎస్.నాందేడ్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్-బొల్లారం-సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్ట్-విశాఖపట్నం మెము రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ నెల 17వ తేదీ వరకూ ఈ రైళ్లు రద్దు కానున్నాయి.
జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు
జూరాల ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిలువ 6.462 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 92 వేల క్యూసెక్కులుగా ఉంది. అవుట్‌ఫ్లో 1లక్ష 5వేల క్యూసెక్కులుగా ఉంది. జారాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు.
మూడో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం దగ్గరలో గోదావరి నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గోదావరిలో 53.80 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు 36 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,18,960 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ఔట్ ఫ్లో 4,56,024 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం 1087.9 అడుగులు కాగా పూర్తి నీటిమట్టం 1091 అడుగులుగా ఉంది.
మంథని చూట్టు వరద నీరు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం చుట్టూ భారీగా వరద నీరు చేరుకుంది. మంథనిలో భారీ వర్షంతో చెరువులు నిండిపాయాయి. బొక్కల వాగు ఉద్ధృతితో మంథని చుట్టూ వరద నీరు పొటెత్తింది. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరదతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.