TRS MLAs Purchase Case: మరోసారి అదే సీన్ రిపీట్ అయిందా..?
26 October 2022, 23:16 IST
- టార్గెట్ నలుగురు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... ఒక్కో తలకు రూ. 100 కోట్లు..! ప్లాన్ సిద్ధం అయింది.. ఇక అమలు చేసే దిశగా పావులు కదిపింది ఓ గ్యాంగ్. సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. కుట్రను తమదైన స్టైల్ లో భగ్నం చేశారు. కూపీ లాగేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర!
Trying to buy TRS MLAs: తెలంగాణ.... ప్రస్తుతం మునుగోడు బైపోల్ తో తెగ హీటెక్కింది. ఎటు చూసిన ఇదే చర్చ...ఇదే ముచ్చట..! రాష్ట్ర రాజకీయమంతా దీనిచుట్టే నడుస్తోంది. నేతల చేరికలతో రాజకీయం ఓ రేంజ్ లో నడుస్తోంది. మునుగోడు ఎన్నికకు సరిగ్గా టైం దగ్గరపడుతున్న వేళ... సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా బేరసారాల కథ వెలుగులోకి వచ్చింది. వంద కోట్ల ఆఫర్ తో చేపట్టిన ఆపరేషన్ ను పోలీసులు భగ్నం చేయటం అధికార టీఆర్ఎస్ తో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సేమ్ సీన్...!
రాష్ట్ర ఏర్పాటు తర్వాత పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారానికి చర్చలు నడిచాయనే వార్తలు బయటికి వచ్చాయి. అప్పట్లో ఇదో పెద్ద సంచలనంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు చెందిన స్టీఫెన్ సన్ (ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే)ను కొనుగోలు చేసేందుకు యత్నించి రేవంత్ రెడ్డి ఏసీబీకి దొరికిపోయారు. స్వయంగా స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన ఆయన్ను అరెస్ట్ చేయటం వెనక భారీ ఆపరేషన్ జరిగినట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఈ వ్యవహరం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఓటుకు నోటు కేసులో జరిగిన తీరుగానే తాజా కథ నడిచిందా అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యేలను ట్రాప్ లో పడేసేందుకు ప్రయత్నించిన గ్యాంగ్ ను... హైదరాబాద్ కు రప్పించటం వెనక పక్కా ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేయించటం వెనక పెద్ద ఆపరేషనే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్పటం ఇందుకు బలం చేకూరినట్లు అయింది.
ఇక తాజా పరిణామాలపై అధికార టీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. నాటి ఓటుకు నోటు కేసును గుర్తు చేస్తూనే... బీజేపీని టార్గెట్ చేసింది. గతంలో రేవంత్ రెడ్డి మాదిరిగానే ప్రస్తుతం... స్వామిజీలు కూడా దొరికిపాయారని చెబుతోంది. దొడ్డి దారిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తోంది. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే వ్యక్తులు కాదని... పులి బిడ్డలని, కేసీఆర్ సైనికులని చెబుతోంది.
ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే దిశగా జరిగిన ఈ పరిణామంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో ఎవరి పేర్లు బయటికివస్తాయి..? అసలు సూత్రదారులు ఎవరు..? కథ అంతా ఎక్కడి నుండి నడిచింది..? ఇంకా ఎవరైనా అరెస్ట్ అవుతారా..? అన్న చర్చ జోరందుకుంది.