Bhupalapalli Murder: హార్వెస్టర్ యజమాని దారుణ హత్య, కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు
28 November 2024, 8:52 IST
- Bhupalapalli Murder: వరి కోతల కోసం పొరుగు జిల్లాకు వచ్చి పని చేసుకుంటున్న ఓ హార్వెస్టర్ యజమానిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా చంపేశారు. కత్తులతో పొడిచి నడి రోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
హార్వెస్టర్ డ్రైవర్ దారుణ హత్య
Bhupalapalli Murder: ఉపాధి కోసం పొరుగూరు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల చంద్రక్క, అంకయ్య దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్ గౌడ్(23)కు సొంతంగా హార్వెస్టర్ ఉంది.
దీంతో మరో డ్రైవర్ ను మాట్లాడుకుని హార్వెస్టర్ పనే చూసుకునేవాడు. కోతల సీజన్ నడుస్తుండటంతో నాలుగు రోజుల కిందట అదే పని మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలానికి వచ్చాడు. తన హార్వెస్టర్ తో చండ్రుపల్లిలో వరి కోతలు చేపడుతూ ఇక్కడే ఉంటున్నాడు.
కత్తులతో పొడిచి దారుణం
శ్రీకాంత్ గౌడ్ బుధవారం సాయంత్రం వరి కోస్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ పై అక్కడికి వచ్చి శ్రీకాంత్ తో గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా.. శ్రీకాంత్ పై దాడికి దిగారు. అప్పటికే పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న కత్తులతో తీవ్రంగా పొడిచేసారు. దీనిని గమనించిన హార్వెస్టర్ డ్రైవర్ కమ్మగోని ప్రదీప్ గౌడ్ పరుగున వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు అతడిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు.
భయపడిపోయిన అతను దుండగులు వచ్చిన బైక్ తాళాలు తీసుకుని గ్రామంలోకి పరుగులు తీశాడు. దీంతో గ్రామస్తులు వస్తారని భయపడిన దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. కాగా గ్రామస్తులంతా అక్కడికి వచ్చి చూసే సరికి శ్రీకాంత్ రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.
కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు
హర్వెస్టర్ ఓనర్ హత్య స్థానికంగా కలకలం రేపగా.. ఘటన విషయం తెలుసుకున్న మహదేవపూర్ సీఐ రామచంద్రారావు, మహదేవపూర్, కాళేశ్వరం ఎస్సైలు పవన్ కుమార్, చక్రపాణితో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దుండగుల పల్సర్ బైక్, వారి వెంట తీసుకొచ్చిన తెల్ల కల్లు బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
మృతుడి కుటుంబ సభ్యుల వద్ద హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇతర జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిని ఇక్కడ హత్య చేయడం పట్ల పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమో.. వివాహేతర సంబంధమో లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా మృతుడి కాల్ డేటాను పరిశీలించి దాని ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నారం పరిధిలోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. కాగా దుండగులు కొమ్మెర గ్రామంలో కూడా మృతుడి ఇంటి వద్ద, చండ్రుపల్లి పరిసరాల్లో నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లుగా తెలిసింది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రామచంద్రారావు వివరించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)