తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Si: మహిళా ఉద్యోగికి వేధింపులు.. వరంగల్‌లో ఎస్సైపై కేసు నమోదు

Warangal SI: మహిళా ఉద్యోగికి వేధింపులు.. వరంగల్‌లో ఎస్సైపై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu

24 January 2024, 6:19 IST

google News
    • Warangal SI: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఓ ఎస్సై తీరు వివాదాస్పదమైంది. ఎన్నికల సమయంలో పరిచయమైన ఓ మహిళా ఉద్యోగిని వేధిస్తుండటంతో ఆమె భర్త పోలీస్ అధికారులను ఆశ్రయించాడు.
సస్పెన్షన్‌‌కు గురైన ఎస్సై అనిల్
సస్పెన్షన్‌‌కు గురైన ఎస్సై అనిల్

సస్పెన్షన్‌‌కు గురైన ఎస్సై అనిల్

Warangal SI: మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఎస్సైపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ జి.అనిల్ కొద్దిరోజులుగా ఎస్సైగా పని చేస్తున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇక్కడ విధుల్లో చేరాడు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వరంగల్ లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించగా.. అక్కడే ఆయనకు డ్యూటీ వేశారు.

హనుమకొండ జులై వాడకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని నీటిపారుదల శాఖలో పని చేస్తోంది. ఆమెకు కూడా ఎన్నికల విధుల్లో భాగంగా ఏనుమాముల మార్కెట్ లోనే డ్యూటీ పడింది. కాగా అక్కడే పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై జి.అనిల్ ఆ మహిళా ఉద్యోగితో మాట కలిపి పరిచయం పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజులు మొదలుపెట్టాడు. రోజూ ఆమె డ్యూటీకి వెళ్లే సమయంలో ఎస్సై కూడా వెంట వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొంచెం పరిచయం పెరగగా.. తరచూ ఫోన్ చేస్తుండేవాడు.

ఓ రోజు తన చెల్లెళ్లను పరిచయం చేస్తానని చెప్పి, ఆమెను వారి ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఆమె అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఎస్సై ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో భయపడిపోయిన ఆమె అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసింది.

తరచూ వేధింపులు

ఎస్సై అనిల్ తరచూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ లతో ఇబ్బందులకు గురి చేయడం, ఆఫీస్‌కు వెళ్తుంటే వెంట పడుతుండటంతో సదరు మహిళా ఉద్యోగి అసలు వాస్తవాన్ని గ్రహించింది. అనంతరం జరిగిన విషయాన్ని తన భర్త భార్గవ్ కు చెప్పింది. దీంతో భార్గవ్ ఎస్సై అనిల్ ను నిలదీశాడు.

తన భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించగా ఎస్సై అనిల్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా కులం పేరున ధూషించడంతో భార్గవ్ సుబేదారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఎస్సై అనిల్ పై స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

దీంతో ఎస్సై అనిల్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 448, 504, 323, 506 తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. దీంతో కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. కాగా విధుల్లో ఉన్న ఎస్సై పైనే కేసు నమోదు కావడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ విషయం వరంగల్ కమిషనరేట్ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. ఎస్సై అనిల్ పై శాఖపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే గతంలోనూ మహిళలను ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన కేసుల్లో పలువురు పోలీస్ ఆఫీసర్లపై వేటు పడగా.. తాజాగా ఎస్సై అనిల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం