Hanamkonda News : వారిద్దరి వయసు 123 ఏళ్లు, షాకిచ్చిన ఎన్నికల అధికారులు!
22 October 2023, 20:51 IST
- Hanamkonda News : ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంతో ఓటర్ గుర్తింపు కార్డుల్లో సమాచారం తప్పుల తడకగా మారింది. హనుమకొండ జిల్లాలో భార్యాభర్తల వయసు 123 ఏళ్లుగా ప్రింట్ చేసి ఇచ్చారు.
ఎన్నికల గుర్తింపు కార్డుల్లో తప్పులు
Hanamkonda News : ఎలక్షన్ సిబ్బంది నిర్వాకం ఓటర్లను కంగు తినేలా చేసింది. వయసు నిర్ధారణ కోసం సరైన డాక్యుమెంట్స్సమర్పిస్తే గానీ ఓటర్ఐడీ జారీ చేయని అధికారులు.. అన్ని ధ్రువపత్రాలు అందించినా తప్పుల ఎంట్రీతో జనాలకు షాక్ఇచ్చారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం ఓటర్లను అవాక్కయ్యేలా చేసింది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కోడెపాక కోటిలింగం, కోడెపాక పద్మ ఇద్దరూ భార్యభర్తలు. ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన ఓటర్ ఐడీ కార్డులుఉండగా.. ఇప్పుడు అధికారుల సూచన మేరకు కొత్త ఓటర్గుర్తింపు కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. 1979లో కోటిలింగం, 1981లో పుట్టినట్టు పదో తరగతి మెమో, గత ఐడీ కార్డులతో కలిపి దరఖాస్తు పెట్టుకున్నారు.
ఈ మేరకు అధికారులు వాళ్లకు కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేశారు. కానీ అధికారులు జారీ చేసిన కార్డులు చూసి కోటిలింగం, పద్మ దంపతులు అవాక్కయ్యారు. 1979, 1981 గా పడాల్సిన వాళ్లిద్దరి పుట్టిన తేదీని అధికారులు 1900గా మార్చారు. దీంతో 44, 42 సంవత్సరాలు ఉండాల్సిన వాళ్ల వయసు.. 123 అయ్యిందన్నమాట. ఈ తప్పును సవరించాల్సిందిగా ఆఫీసర్లను సంప్రదించినా.. పట్టించుకోవడం లేదని కోటిలింగం వాపోయారు. తమ సమస్యను పరిష్కరించి, మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.