తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1: జూన్‌11న ప్రిలిమ్స్‌.. ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష

TSPSC Group 1: జూన్‌11న ప్రిలిమ్స్‌.. ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష

HT Telugu Desk HT Telugu

15 May 2023, 9:54 IST

google News
    • TSPSC Group 1: పేపర్‌ లీక్ వ్యవహారంతో రద్దైన గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షలను జూన్‌11న తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులు ఉండటంతో  ఆఫ్‌లైన్ పద్ధతిలో, ఓఎంఆర్‌  విధానంలోనే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించనున్నారు. 
జూన్‌ 11న తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష
జూన్‌ 11న తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష

జూన్‌ 11న తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష

TSPSC Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 11 నిర్వహించనున్నారు. పేపర్‌ లీక్ వ్యవహారంతో గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేశారు. దీంతో ఈ పరీక్షల్ని తిరిగి ఆఫ్‌లైన్‌ పద్ధతిలో, ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది.

జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు టిఎస్‌పిఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు.

మెయిన్స్‌ పరీక్షలకు 25,050 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.

పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని నియమించారు.వీరితో పాటు కొత్తగా డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సీనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, జూనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి క్యాడర్‌ లా ఆఫీసర్‌ పోస్టులను మంజూరు చేసింది.

పేపర్‌ లీక్ వ్యవహారం నేపథ్యంలో గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అందరినీ మార్చింది. కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. జూన్‌ 11నే ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీలో ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నది. ఆ సంఖ్యను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే కంప్యూటర్‌ బెస్డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్‌ పద్ధతిలో లెక్కిస్తున్నారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సైతం ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.

తదుపరి వ్యాసం