తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : ప్రయాణిస్తున్న కారుపై కూలిన ధాన్యం బస్తాలు - ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Warangal : ప్రయాణిస్తున్న కారుపై కూలిన ధాన్యం బస్తాలు - ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

HT Telugu Desk HT Telugu

28 January 2024, 11:05 IST

google News
    • Warangal District News: ప్రయాణిస్తున్న కారుపై ధాన్యం బస్తాలు పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం… వరంగల్ జిల్లాలో జరిగింది.
ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు

ప్రమాదానికి గురైన కారు

Warangal District News: వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనువడి పుట్టు వెంట్రుకలు తీసేందుకు వేములవాడకు వెళ్లి, ఇంటికి ప్రయాణమైన ఓ కుటుంబాన్ని రహదారి ప్రమాదం చిదిమేసింది. ప్రయాణిస్తున్న కారుపై ఎదురుగా వస్తున్న లారీలోని ధాన్యం బస్తాలు పడిపోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన జినుకుల నాగరాజు(60), అతని భార్య లలిత, కొడుకు శ్రీకాంత్, కోడలు సింధూ కలిసి రెండు రోజుల కిందట హనుమకొండ రామారంలోని తన కూతురి ఇంటికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి కూతురు కొడుకైన మనువడి పుట్టు వెంట్రుకలు తీసేందుకు శుక్రవారం వేములవాడకు బయలుదేరి వెళ్లారు. వేములవాడలో పుట్టు వెంట్రుకలు, మొక్కులు సమర్పించి, శనివారం ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం కూడా పూర్తి చేస్తున్నారు. మొక్కులన్నీ చెల్లించిన అనంతరం అక్కడి నుంచి సంతోషంగా శనివారం సాయంత్రానికి తిరిగి హనుమకొండకు చేరుకున్నారు.

కారులోనే స్పాట్ డెడ్

శనివారం రాత్రి 9 గంటల సుమారులో హనుమకొండ రామారం నుంచి నాగరాజు కుటుంబ సభ్యులు తమ స్వగ్రామం నర్సంపేట మండలం రామారం బయలుదేరారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామ శివారుకు చేరుకున్నారు. లక్నెపల్లి సమీపంలోని అపెక్స్ కాలేజీ దాటి వెళ్తుండగా.. నర్సంపేట వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ధాన్యం లారీ ఎదురుగా వచ్చింది. రెండు వెహికిల్స్ ఎదురెదురుగా రన్నింగ్ లోనే ఉండగా లారీలోని ధాన్యం బస్తా ఒక్కసారిగా కారుపై కూలాయి. బస్తాలు ఒక్కసారిగా మీద పడటంతో కారు మొత్తం నుజ్జునుజ్జయింది. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ప్రయాణిస్తున్న జినుకుల నాగరాజు తీవ్ర గాయాలతో అక్కడికక్కడనే ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య జినుకుల లలిత, కొడుకు శ్రీకాంత్, కోడలు సింధూకు తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ జరిగి కారు మొత్తం నుజ్జునుజ్జు కాగా.. ధాన్యం బస్తాలు నడిరోడ్డుపై పడ్డాయి. దీంతో వరంగల్– నర్సంపేట మార్గంలో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాలాసేపు ట్రాఫిక్ స్తంభించిపోగా.. స్థానికులు వెంటనే 108 కు కాల్ చేసి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకోగా.. అప్పటికే నాగరాజు మరణించాడు. మిగతా క్షతగాత్రులను అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. లలిత, శ్రీకాంత్, సింధూజ తలలకు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వారికి చికిత్స అందిస్తున్నట్లు ఎంజీఎం డాక్టర్లు తెలిపారు. కాగా అంబులెన్స్ సిబ్బంది వెంటనే నాగరాజు బంధువులకు సమాచారం అందించారు. అప్పటివరకు సంతోషంగా గడిపి అంతలోనే ప్రమాదానికి గురి కావడంతో రామారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం