Medico Preethi Case : ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో వర్సిటీ అధికారులపై గవర్నర్ ఆగ్రహం
28 February 2023, 15:29 IST
- Medico Preethi Case : మెడికో ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం అధికారులపై గవర్నర్ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆరోగ్యంపై మొదట తప్పుడు సమాచారం ఇచ్చారని సీరియస్ అయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీకి లేఖ రాసిన రాజ్ భవన్... ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కాళోజీ వర్సటీ వీసికి గవర్నర్ కార్యాలయం లేఖ
Medico Preethi Case : కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఉదంతంపై.. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సీనియర్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని.. ఇందుకు కారణమైన సైఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. అలాగే.. కళాశాలలో ర్యాగింగ్ ని నిరోధించడంలో ప్రిన్సిపల్ విఫలమయ్యారని... ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రీతి ఆత్మహత్య ఘటనపై కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతికి లేఖ రాసిన గవర్నర్ తమిళి సై.. వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత... ఆమెను నిమ్స్ కు తరలిండంతో కీలకమైన సమయం కోల్పయినట్లు అయిందని అభిప్రాయపడ్డారు. విద్యార్థినికి ఎంజీఎంలోనే చికిత్స అందించి ఉండాల్సిందని... అత్యాధునిక పరికరాలను ఎంజీఎంకే తరలించాల్సి ఉండేదని పేర్కొన్నారు.
ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిచ్చిన అధికారులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని ఆరోగ్యం సరిగా లేదని మొదట చెప్పారని.. ఇలా ఎందుకు తెలిపారని ప్రశ్నించారు. నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించారంటూ.. అధికారుల తీరుని తప్పుపట్టారు. మెడికో ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని.. వర్సిటీల్లో ర్యాగింగ్, వేధింపుల తరహా ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సత్వర చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు... పనితీరుపై సమగ్ర రిపోర్ట్ అందించాలని గవర్నర్ తమిళి సై ఆదేశించారు.
మరోవైపు.. ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో.. ర్యాగింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు రుజువైతే... అందుకు కారణం అయిన విద్యార్థి మెడికల్ సీటను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మెడికల్ కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు తరచూ నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ర్యాగింగ్ ను పూర్తిగా నిరోధించలేకపోతున్నారు. ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకంటే తప్ప మార్పు రాదని ప్రభుత్వం భావిస్తోంది. సస్పెండ్ లాంటి చిన్న చిన్న శిక్షలతో ర్యాగింగ్ కు అడ్డుకట్ట వేయడం కష్టమేనని... వేధింపులకు పాల్పడితే మెడికల్ సీటు పోతుందనే భయం ఉంటే తప్ప మార్పు రాదని కొందరు సీనియర్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వం త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే... మెడికోల పనివేళలపైనా వైద్యశాఖ దృష్టి సారించింది. గంటల కొద్దీ డ్యూటీల విషయంలో పునరాలచోన చేస్తోంది. ప్రత్యామ్నాయ విధానాలపై కసరత్తు చేస్తోంది.