తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Raja Singh : అదే జరగకపోతే రాజకీయ సన్యాసమే - పార్టీ మార్పుపై రాజాసింగ్

MLA Raja Singh : అదే జరగకపోతే రాజకీయ సన్యాసమే - పార్టీ మార్పుపై రాజాసింగ్

14 July 2023, 16:18 IST

google News
    • MLA Raja Singh Latest News: బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. మంత్రి హరీశ్ రావుతో భేటీ నేపథ్యంలో పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 
ఎమ్మెల్యే రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్

Goshamahal MLA Raja Singh: బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్... మంత్రి హరీశ్ రావుతో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో... రాజాసింగ్ పార్టు మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు అయింది. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజాసింగ్. బీఆర్ఎస్ లోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బదులిచ్చారు. తాను బీజేపీని వదలి ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను పార్టీ అధినాయకత్వం ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కీలక ప్రకటన చేశారు.

ఇక మంత్రి హరీశ్ రావును కలవటంపై కూడా క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్.ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు విషయంపై చర్చించేందుకే వెళ్లానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే హరీశ్‌ రావును కలిశానన్నారు. తాను చివరి వరకు బీజేపీలోనే ఉంటానని… పార్టీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల కిందట కూడా రాజాసింగ్… తెలుగుదేశంలోకి వెళ్తారనే చర్చ నడించింది. ఈ వార్తలను అప్పట్లో తీవ్రంగా ఖండించారు రాజాసింగ్. తన ఆలోచనలకు ఏ పార్టీ సెట్ కాదని… కేవలం బీజేపీనే సెట్ అవుతుందన్నారు.

వివాదాలకు కేరాఫ్…

ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్‌ .... ఆయన ఓ వార్నింగ్ ఇస్తే పెద్ద రచ్చ జరగాల్సిందే..! గోరక్ష పేరుతో స్వయంగా అతనే రంగంలోకి దిగుతుంటారు..! హిందూ ధర్మ రక్షణే తన ధ్యేయం అంటూ దూకుడుగా ముందుకెళ్తుంటారు. శ్రీరామనవమి వస్తే... రాజాసింగ్ తలపెట్టే శోభాయాత్ర ఓ రేంజ్ లోనే ఉంటుంది. ఇందుకోసం భారీస్థాయిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తుంటారు. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి… ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సొంతంగానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ...

రాజాసింగ్ రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన... శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణతో వెలుగులోకి వచ్చారు. అయితే రాజాసింగ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగుదేశంతో కావటం ఆసక్తికరం. గతంలో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన... 2014, 2018లో మంగళ్‌హాట్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు.

2015లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు రాజాసింగ్. అర్ధరాత్రి డీజే నిర్వహణను పోలీసులు ఆపివేసిన క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనిపై రాజాసింగ్ పై కేసు నమోదైంది.

ఇక 2015లో మరో వివాదానికి తెరలేపారు రాజాసింగ్. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా పిగ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామంటూ ప్రకటన ఇవ్వటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

2018 ఎన్నికల అఫిడవిట్ లో రాజాసింగ్ పేర్కొన్న వివరాలపై ప్రకారం... అతనిపై మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా విద్వేషపూరిత ప్రసంగాల విషయంలోనే నమోదైనవిగా ఉన్నాయి.

మరోవైపు రాజాసింగ్‌ను రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్‌బుక్‌ లేబుల్‌ చేసింది. ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ ఫారం నుంచి తొలగించింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్‌ ఆందోళన నిర్వహించారు. దీంతో ఆయనను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు.

2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది.

హైదరాబాద్‌లో మునావర్ ఫరుఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో... పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు రాజాసింగ్. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

రాజా సింగ్ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన బీజేపీ అధిష్టానం ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్నుంచి ఆ ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి.

తదుపరి వ్యాసం