TSPSC Upper Age Limit: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…తెలంగాణలో రెండేళ్ల వయో పరిమితి పెంపు
12 February 2024, 13:24 IST
- TSPSC Upper Age Limit: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. నోటిఫికేషన్లు రాక వయసు మీరిపోతున్న నేపథ్యంలో రెండేళ్ల సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో నిరుద్యోగుల వయోపరిమితి పెంపు
TSPSC Upper Age Limit: తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గరిష్ట వయో పరిమితిని 46ఏళ్లుగా పరిగణిస్తారు. ఉద్యోగ నియామక ప్రకటనలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గరిష్ట వయో పరిమితి దాటి పోతుండటంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గత రెండేళ్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు రకరకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి. 2022లో వెలువడిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ వయసు మీరిపోతుందనే ఆందోళనలో ఉన్నఉద్యోగార్థులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట వయో పరిమితిని రెండేళ్లకు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 30ను వెలువరించారు. ఈ మేరకు స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996కు సవరణలు చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34ఏళ్ల నుంచి 44ఏళ్ల కు పెంచుతున్నట్లు గతంలో ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు రెండేళ్ల పాటు అమల్లో ఉండనున్నాయి. నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు వెలువరించనున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం 44ఏళ్ల వయో పరిమితిని 46ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం రెండేళ్ల పాటు గరిష్ట వయసును 46ఏళ్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు గెజిట్‌లో ఉత్తర్వులు ప్రచురిస్తున్నట్లు పేర్కొన్నారు.