TSREIRB Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గురుకులాల్లో మరో రెండు వేల ఉద్యోగాలు, హైకోర్టు గ్రీన్ సిగ్నల్
29 March 2024, 8:52 IST
- TSREIRB Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో పలు ఉద్యోగాలకు హైకోర్టు తీపి కబురు అందించింది. భర్తీ చేయకుండా మిగిలిపోయిన పోస్టుల్ని మెరిట్ లిస్ట్ ఆధారంగా తిరిగి భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో గురుకుల పాఠశాలల్లో మరో 2వేల ఉద్యోగాలు దక్కే అవకాశం
TSREIRB Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు హైకోర్టు HIgh court తీపి కబురు చెప్పింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలకు హాజరైన వారిలో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
గురుకుల Gurukula విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది ఆగష్టులో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్లు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పలు ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయాయి. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాటిలో మెరుగైన ఉద్యోగంలో చేరిపోయారు. ఇలా ఉద్యోగాల్లో చేరిపోగా వారు వదిలేసిన పోస్టులు దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి. వాటిని మెరిట్ జాబితా Merit List ఆధారంగా తర్వాత స్థానాల్లో ఉన్న వారితో భర్తీ చేేయాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకే షనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో పలువురు అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో రెండు మూడు ఉద్యోగాలకు కూడా కొందరు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో చేరే సమయంలో ఒకదానిలో చేరి మిగిలిన పోస్టుల్ని వదిలేసుకోవడంతో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా తర్వాత స్థానాల్లో ఉన్న వారితో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గురుకుల నియామక బోర్డుకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. గురుకుల విద్యాసంస్థల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల వంటి పోస్టులను గతేడాది ఏప్రిల్ 5న నోటిఫికేషన్లు జారీ చేశారు.
కామన్ రిక్రూట్‌మెంట్ నిర్వహించడంతో కొందరు అన్ని పరీక్షలు రాసి రెండు, మూడు ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరగా మిగిలిన వాటిని స్వచ్ఛందంగా వదులుకోవడంతో దాదాపు 2 వేల పోస్టులు భర్తీ కాలేదు.
ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని, ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరై తదుపరి మెరిట్ లిస్ట్‌లో ఉన్న ఉన్న అభ్యర్థులతో నింపాలనిహైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు ఈ విధానాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొంటూ పరీక్షలకు హాజరైన విజయ్ మనోహర్‌తో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఫాల్ అవుట్ విధానంలో కానీ రిలింక్విష్మెంట్ సూత్రం ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేవించారు. ప్రాధాన్య క్రమంలో ఉన్నత పోస్టులను మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ పూర్తి చేసి, అవరోహణ క్రమంలో కింది పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. కేసు విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేశారు.
TSREIRB Results: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది ఆగష్టులో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించారు.
డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇవన్నీ ఏకకాలంలో విడుదలయ్యాయి.
రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫిబ్రవరిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. 14వ తేదీన అపాయింట్‌మెంట్లు అందచేశారు. ఎంపికైన అభ్యర్థులు తమతో పాటు నిర్దేశిత ధృవీకరణ పత్రాలను పరిశీలన కోసం తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్, డిగ్రీ పట్టాతో పాటు మార్కుల జాబితా, లైబ్రరీ సైన్స్‌లో ఒరిజినల్ పట్టా, ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ లేకుంటే రెసిడెన్స్, స్థానిక ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం సహా 12 రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఒక్కో పోస్టుకు ఇద్దరి ఎంపిక…
గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు విడుదల చేసింది. తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో https://treirb.cgg.gov.in/home అందుబాటులో ఉంచింది.