Telangana Govt : సర్కార్ బడి పిల్లలకు అదిరిపోయే శుభవార్త - ఫ్రీగా చారిత్రక, పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు
27 September 2024, 21:09 IST
- తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలను చూపించనుంది. ఇందుకోసం 'తెలంగాణ దర్శిని' పేరుతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 1 లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. పర్యాటక, చారిత్రక ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
'తెలంగాణ దర్శిని' పేరుతో ఈ మేరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇందులో భాగంగా… ఇవాళ తెలంగాణ దర్శని పోస్టర్ ను ఆవిష్కరించారు.
విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యక్షంగా చూసి అనుభవించడం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనే శాస్త్రీయ నిరూపణలున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తలపెట్టారు.
రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులు విడుదల చేసింది.
తొలి దశలో 1లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. తెలంగాణ దర్శినికి సంబంధించిన విధివిధానాలను జీవోలో పొందుపర్చారు.
మెట్లబావుల పునరుద్ధరణ - కీలక ఒప్పందాలు:
హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన ముఖ్యమంత్రి సంకల్పానికి అడుగు ముందుకు పడింది. పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు. సీఐఐ తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం గారు సచివాలయంలో సమావేశమయ్యారు.
టూరిజం మంత్రి జూపల్లితో పాటు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం సమక్షంలో పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ… హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మూసీ పరివాహన ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, మూసీ ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జూబ్లీహాల్‌కు చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దాని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సీఐఐకి సూచించారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనాలు, హైకోర్టు, సిటీ కాలేజీ, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు. నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్ఫోసిస్, మంచిరేవుల మెట్ల బావిని SaiLifeSciences దత్తత తీసుకున్నాయి. సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్, అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఎస్ఆర్టీసీ, కోఠీలోని రెసిడెన్సీ మెట్ల బావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నాయి.