తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Route Map: మేడారం మహాజాతరకు వెళ్తున్నారా? ఇదే రూట్ మ్యాప్..ఫాలో అవ్వండి

Medaram Route Map: మేడారం మహాజాతరకు వెళ్తున్నారా? ఇదే రూట్ మ్యాప్..ఫాలో అవ్వండి

HT Telugu Desk HT Telugu

20 February 2024, 10:09 IST

google News
    • Medaram Route Map: మేడారం మహాజాతర రేపటి నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో యాత్రకు వచ్చే వారి కోసం ములుగు పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. 
మేడారం జాతర కోసం రూట్ మ్యాప్‌ విడుదల చేసిన ములుగు పోలీసులు
మేడారం జాతర కోసం రూట్ మ్యాప్‌ విడుదల చేసిన ములుగు పోలీసులు

మేడారం జాతర కోసం రూట్ మ్యాప్‌ విడుదల చేసిన ములుగు పోలీసులు

Medaram Route Map: మేడారం మహాజాతరలో ఇప్పటికే చాలామంది ముందస్తు మొక్కులు సమర్పిస్తుండగా.. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాజాతర జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయగా పోలీస్ శాఖ TS Police కూడా అన్ని విధాలుగా సంసిద్ధమైంది.

వన దేవతలైన సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వేలాది వాహనాలు తరలి రానుండగా, మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం నుంచి జాతర ముగిసేంత వరకు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు చోట్ల వన్ వే కూడా పెట్టారు.

మేడారంకు సంబంధించిన రూట్ మ్యాప్RouteMap ను ములుగు ఎస్పీ శబరీష్ విడుదల చేశారు. మేడారం మహాజాతరకు వచ్చీపోయే వాహనాలు ఏఏ రూట్ లలో ప్రయాణించాలో. ఎక్కడి నుంచి క్రాసింగ్ తీసుకోవాలో వివరిస్తూ మేడారం రూట్ మ్యాప్ ను ప్రకటించారు. పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం మేడారం రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..

మేడారం వచ్చేందుకు నాలుగు రూట్లు..

* హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా వచ్చే వాహనాలు గుడెప్పాడ్, ఆత్మకూరు మీదుగా ములుగు, పస్రా దగ్గర క్రాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి.

* ఖమ్మం, మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి చేరుకోవాలి. అక్కడి నుంచి నేషనల్ హైవే 163 మీదుగా ములుగు, పస్రా, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ మార్గంలో వచ్చే వాహనాల కోసం ఊరట్టం క్రాస్ నుంచి ప్రాజెక్ట్ నగర్ వరకు ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేస్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.

* జాతర ముగించుకొని తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, గొళ్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, నుంచి గుడెప్పాడ్ క్రాస్ దగ్గర రైట్ తీసుకొని ఎన్హెచ్ 163 ఎక్కాలి. అక్కడి నుంచి హైదరాబాద్, నల్గొండ, కరీం నగర్, వరంగల్, హనుమకొండ మార్గంలో గమ్యస్థానాలకు వెళ్లిపోవచ్చు.

* ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్లే వాహనాలు మాత్రం గుడెప్పాడ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ములుగు వైపు ప్రయాణించాలి. ఆత్మకూరు, కటాక్షపూర్ దాటిన తరువాత మల్లంపల్లికి వచ్చి అక్కడ టర్న్ తీసుకుని సొంత గ్రామాలకు వెళ్లిపోవచ్చు.

* గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి చింతకాని, యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. ఇలా వచ్చే వాహనాల కోసం ఊరట్టం దగ్గరే పార్కింగ్ ప్లేస్ లు కేటాయించారు. ఈ వెహికిల్స్ అన్నీ కూడా తిరుగు ప్రయాణంలో ఇదే రూట్ లో వెళ్లిపోవాల్సి ఉంటుంది. దాంతో పాటు నార్లాపూర్, బయ్యక్కపేట, గొళ్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా కూడా వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది.

* ఛత్తీస్ గఢ్. భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాలన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చినదారిలోనే వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ఆర్టీసీ, వీఐపీ వెహికిల్స్ ఇలా..

మేడారానికి భక్తులను చేరవేసే ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వాహనాల కోసం పాత రూట్ నే అమలులో ఉంచారు. ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వాహనాలు అన్నీ తాడ్వాయి దగ్గర క్రాస్ తీసుకొని మేడారం చేరుకోవాలి. మళ్లీ అదే రూట్లో ఈ వాహనాలు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది.

పార్కింగ్ ప్లేసుల్లో సకల సౌకర్యాలు

మహాజాతరకు 'మేడారం జాతర' పేరుతో మొబైల్ యాప్ విడుదల చేసిన అధికారులు వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా మేడారం 33 పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేశారు. మేడారం చుట్టూరా 1,400 ఎకరాలను పార్కింగ్ కోసమే కేటాయించారు.

ఆర్టీసీ బస్సులను తాడ్వాయి మేడారం రూట్ బస్టాండ్ ప్లేస్ లో పార్క్ చేయాలి. వీఐపీ, వీవీఐపీలకు గద్దెలకు దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ కేటాయించారు. పస్రా, మేడారం రూట్లో జంపన్నవాగు దగ్గర నుంచి ప్రైవేట్ వెహికిల్స్ పార్క్ చేసుకునే అవకాశం కల్పించారు. భక్తులు సాధ్యమైనంత వరకు ఆర్టీసీ సేవలనే ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం