తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Godavari Floods: గోదావరికి తరచూ భారీ వరదలు ఎందుకొస్తాయి, అంత నీరు ఎక్కడి నుంచి వస్తోంది..

Godavari Floods: గోదావరికి తరచూ భారీ వరదలు ఎందుకొస్తాయి, అంత నీరు ఎక్కడి నుంచి వస్తోంది..

HT Telugu Desk HT Telugu

22 July 2024, 12:32 IST

google News
    • Godavari Floods: గోదావరితో తెలుగు నేలది విడదీయలేని బంధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ధాన్యాగారాలుగా మార్చిన రెండు ప్రధాన నదుల్లో ఇదీ ఒకటి. తెలుగు ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చడంతోపాటు పారిశ్రామీకీకరణలోనూ కీలకంగా మారింది.
భద్రాచలం వద్ద మహోగ్రరూపంతో ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద మహోగ్రరూపంతో ప్రవహిస్తున్న గోదావరి

భద్రాచలం వద్ద మహోగ్రరూపంతో ప్రవహిస్తున్న గోదావరి

Godavari Floods: గోదావరితో తెలుగు నేలది విడదీయలేని బంధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ధాన్యాగారాలుగా మార్చిన రెండు ప్రధాన నదుల్లో ఇదీ ఒకటి. తెలుగు ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చడంతోపాటు పారిశ్రామీకీకరణలోనూ కీలకంగా మారింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇదే గోదావరికి మరో పార్శ్వమూ ఉంది. అదే 'వరద గోదావరి'. గోదావరికి తరచూ వచ్చే భారీ వరదలు ప్రాణ నష్టానికి కారణమవుతుంటాయి. పెద్ద యెత్తున పంట నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంటాయి. అలాంటి సమయాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు వరద నిర్వహణ పెను సవాలుగా నిలుస్తుంటుంది. 2022 జులైలో గోదావరికి మొదలైన వరద ప్రభావం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది.

ఉపనదుల నుంచే అత్యధిక నీరు..

మహారాష్ట్రలోని 'త్రయంబకేశ్వర్'లో పుట్టిన గోదావరి ఏపీలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంతో కలుస్తుంది. 'కేంద్ర జల సంఘం'(CWC) నిర్వహించే INDIA-WRIS వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. గోదావరి తన 1,465 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రాణహిత, మంజీర, మానేరు, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని లాంటి ప్రధాన ఉపనదులు, పెద్దపెద్ద వాగుల ప్రవహాలను తనలో కలుపుకొని దేశంలోనే అతిపెద్ద నదీపరివాహక (క్యాచ్ మెంట్) ప్రాంతాలలో ఒకటిగా మారింది.

గోదావరిని స్థూలంగా ఎగువ, మధ్య, దిగువ నదీ ప్రాంతాలుగా విభజించి చూస్తే, మధ్య, దిగువ ప్రాంతాల్లో కలిసే ప్రాణహిత, ఇంద్రావతి, శబరి లాంటి ఉపనదుల నుంచే ఎక్కువ శాతం (59.7 శాతం) నీరు గోదావరిలో చేరుతుంది. గోదావరిలో ప్రవహించే ప్రతి వెయ్యి లీటర్ల నీటిలో సుమారు 600 లీటర్ల నీరు ఈ నదుల నుంచే వచ్చి చేరుతుంది.

కృష్ణాతో పోలిస్తే గోదావరికి వరదలు ఎక్కువేనా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రధానమైన గోదావరి, కృష్ణా నదులు రెండింటికి వరదలు సాధారణమే అయినా, గోదావరికే తరచూ భారీ వరదలు వస్తుంటాయి. దీనికి కారణాలు ఏమిటి? కృష్ణతో పోలిస్తే గోదావరి పరివాహక ప్రాంత విస్తీర్ణం పెద్దది కావడం, ఈ నదిపై భారీ నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం ప్రధాన కారణాలని నీటిపారుదల నిపుణుల అభిప్రాయం.

గోదావరి వరద ప్రభావం నదీ గమనం మొత్తంలో అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో మనకు కనబడదు. ఎగువ ప్రాంతాల్లోని జిల్లాలతో పోలిస్తే తెలంగాణలో ములుగు, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని అవిభాజ్య గోదావరి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ముంపుతో పాటు సంభవించే వివిధ రకాల నష్టాలు కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువ. ఎగువ మహారాష్ట్రలో గోదావరిపై అంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పైభాగంలో, ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి వినియోగం పెరిగి, ఉత్తర తెలంగాణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వరదల స్వభావం మారిందని, గతంతో పోలిస్తే వరద ముప్పు తగ్గిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం వరకు వరదలు వచ్చే సందర్భాలు తగ్గాయి. మధ్య గోదావరి ప్రాంతంలో ముఖ్యంగా, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలయికతో గోదావరి వరద స్వరూపం మారుతోందని, దానికి దిగువన ఇంద్రావతి, శబరి చేరడంతో తరచూ భారీ వరదలు వస్తున్నాయన్నది నిపుణుల విశ్లేషణ.

"మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో రిజర్వ్ అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో డ్యామ్‌ల నిర్మాణం జరగలేదు. అక్కడ కురిసిన వర్షం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాణహిత ద్వారా నేరుగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. అయితే ప్రస్తుతం పెన్ గంగా, వార్ధా, వైన్ గంగాలపై మహారాష్ట్ర కొన్ని ప్రాజెక్టులు కడుతోంది. భవిష్యత్తులో ఈ నీరు అంతగా రాదు'' అని నిపుణులు చెబుతున్నారు.

1986లో ధవళేశ్వరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల రికార్డ్ వరద సమయంలో నిజామాబాద్ జిల్లాలో పెద్దగా వరద ప్రభావం లేదు. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల కలయిక తర్వాతే కాళేశ్వరం, ఇచ్చంపల్లి, ఏటూరు నాగారం, భద్రాచలం ప్రాంతాల్లో గోదావరి భారీగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థూలంగా చెప్పాలంటే, గోదావరితో పోలిస్తే, కృష్ణ, దాని ఉపనదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు ఎక్కువగా ప్రాజెక్టులు కట్టాయి. ఆ ప్రాజెక్టులను దాటి వచ్చాక 200 టీఎంసీల పైగా సామర్థ్యంతో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు కృష్ణపై ఉన్నాయి. అవి పూర్తిగా నిండి కృష్ణకు వరదలు రావాలంటే ఎక్కువ సమయం పడుతుంది.

గోదావరికి అత్యధికంగా నీటిని అందించే ప్రాణహిత, శబరి, ఇంద్రావతిలపై పెద్దగా ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. 2022 జులై వరదల సమయంలో (13,14 తేదీల్లో) కాళేశ్వరం సంగమం వద్ద గోదావరి వరద 29 లక్షల క్యూసెక్కులు పైబడింది. ఇంత వరద సామర్థ్యాన్ని తరలించే విస్తీర్ణం గోదావరి నదీ గర్భంలో లేదు. కాబట్టే నది మట్టం 108 మీటర్ల పైన చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులను (Climatic Changes), ఈ ఏడు వచ్చిన వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని, తదనుగుణంగా గోదావరి తీర ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. భవిష్యత్తులో పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సమన్వయం అవసరం.

భద్రాచలం ముంపు వెనుక కారణం అదే. రెండు రాష్ట్రాల ఇంజినీర్ల మధ్య సమన్వయం ఉంటే ముంపు నివారించవచ్చు. వర్షాలను నియంత్రించలేం కానీ సమన్వయంతో వరద నియంత్రణ చర్యలు చేపట్టి నష్టాన్ని తగ్గించవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ సానా మారుతి అభిప్రాయపడ్డారు.

పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గోదావరి

వరదలు ఎన్ని రకాలు?

కేంద్ర జల సంఘం వర్గీకరణ ప్రకారం.. వరద స్థాయిని బట్టి 1) సాధారణ, 2) సాధారణంగా కంటే ఎక్కువ, 3) తీవ్రమైన, 4) అత్యంత తీవ్రమైన స్థాయిగా పేర్కొంటారు. వరద అంచనా కేంద్రాల వద్ద వరద నీటి మట్టం, హెచ్చరిక స్థాయి కంటే తక్కువగా ప్రవహిస్తే సాధారణ వరదగా, హెచ్చరిక స్థాయిని తాకినా లేదా అది దాటి ప్రమాదకర స్థాయికి దగ్గరగా చేరితే సాధారణం కంటే ఎక్కువ వరదగా భావించి 'పసుపు రంగు' హెచ్చరికను జారీ చేస్తారు.

వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి హయ్యస్ట్ ఫ్లడ్ లెవల్‌కు దిగువన ఉన్నప్పుడు తీవ్రమైన వరదగా పరిగణించి 'ఆరేంజ్ అలర్ట్' ఇస్తారు. అలాంటప్పుడు కేంద్ర జల సంఘం ప్రతి మూడు గంటలకు ప్రత్యేక వరద సమాచారాన్ని జారీ చేస్తుంది. అత్యంత తీవ్రమైన వరద సమయంలో, వరద అంచనా కేంద్రాల వద్ద నీటి ప్రవాహం అత్యధిక వరద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఈ సమయంలో 'రెడ్ బులిటెన్' జారీ చేసి ప్రతి గంటకు వరద సమాచారం అందిస్తారు.

రెడ్, ఆరెంజ్ బులెటిన్‌లు ప్రధానమంత్రి కార్యాలయం వరకు వెళ్తాయి. ఎల్లో బులెటిన్‌‌‌ను వరద నష్ట నివారణకు సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు పంపుతారు. భారీ వర్షాలు కురిసినప్పుడు కేంద్ర జల సంఘం ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలను జారీ చేస్తుంది. దీనికోసం వివిధ ప్రాంతాల్లో 'వరద అంచనా కేంద్రాలు' నిర్వహిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం, భద్రాచలం, ధవళేశ్వరం, జూరాల, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, మంత్రాలయం వద్ద వరద ప్రధాన అంచనా కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర జల సంఘం వరద హెచ్చరికల నెట్వర్క్‌లో భాగంగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 325 వరద అంచనా కేంద్రాల నుంచి వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వైర్‌లెస్, ఫోన్, ఈ-మెయిల్, మీడియా, సోషల్ మీడియా, వెబ్‌సైట్ లాంటి సమాచార మార్గాల ద్వారా చేరవేస్తోంది.

వరదల నిర్వహణ ఎలా జరుగుతుంది?

భారతదేశంలో వరదల నిర్వహణకు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో రెండు అంచెల వ్యవస్థ ఉంది. 1945లో ఏర్పాటైన సెంట్రల్ వాటర్ కమీషన్ (కేంద్ర జలసంఘం - CWC) కేంద్ర స్థాయిలో వరద నియంత్రణ, డ్యామ్‌లు నదుల పరిరక్షణ, దేశవ్యాప్తంగా నీటి వనరుల అభివృద్ది, పరిశోధన, నిర్వహణ, అంతర్జాతీయ జల సంబంధాల బాధ్యతలను చూస్తుంది.

సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రకారం 2022 నాటికి భారతదేశంలో 5334 పెద్ద డ్యామ్‌లు ఉన్నాయి. వీటిలో 80 శాతం డ్యామ్‌లు 25 ఏళ్లు పాతవి. పెద్ద డ్యామ్‌లలో 227 డ్యామ్‌లు వందేళ్ల పూర్వం నిర్మించినవి. గడగిచిన 100 ఏళ్లలో 41 డ్యామ్‌లు వరద నివారణలో విఫలం అయ్యాయి. 2021 ద్వితీయార్ధంలో ఆంధ్రప్రదేశ్‌లోని 'అన్నమయ్య డ్యామ్' వైఫల్యంతో జరిగిన నష్టం చాలా మందికి తెలిసే ఉంటుంది.

భారత్‌లో 98 శాతం డ్యామ్‌ల నిర్వహణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రాజెక్టుల వైఫల్యాలకు ఆస్కారం లేకుండా దేశం మొత్తం మీద ఒకే రకమైన 'డ్యామ్ సేఫ్టీ ప్రోటోకాల్స్' కోసం కేంద్ర ప్రభుత్వం 'డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021'ను తెచ్చింది.

ఈ చట్టంలో భాగంగా డ్యామ్‌ల నిఘా, పర్యవేక్షణ, నిర్వహణ, విఫలమయ్యే అవకాశం ఉన్న డ్యామ్‌ల నిర్వహణ, రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆయా నదీ పరివాహక ప్రాంతాల వరద నిర్వహణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో కోతలను తగ్గించే చర్యలు, వరద అంచనా వ్యవస్థ ఆధునీకరణ, కట్టలు పటిష్టపరచడం, రిజర్వాయర్ల సామర్థ్యం మెరుగుపరచడం ద్వారా దిగువ ప్రాంతాలకు వరద చేరే సమయాన్ని నియంత్రించడం లాంటి కొన్ని మార్గదర్శక సూత్రాలు, నిబంధనలు పొందుపరిచింది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం