GHMC Theme Parks: నలుమూలాల థీమ్ పార్కులు.. 'పచ్చదనం' వైపు అడుగులు
12 January 2023, 21:28 IST
- Theme Parks in Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు జీహెచ్ఎంసీ మరింత కసరత్తు చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన థీమ్స్ పార్క్ లే కాకుండా... మరిన్నింటిని పూర్తి చేయటంపై ఫోకస్ పెట్టనుంది.
జీహెచ్ఎంసీ థీమ్స్ పార్కులు
Theme Parks in Hyderabad: హైదరాబాద్‌ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఓవైపు హరితహారం కొనసాగుతుండగా.. మరోవైపు కాలనీలు, బస్తీల్లో ప్రజలు సేద తీరేలా పార్కులు అభివృద్ధి చేస్తోంది జీహెచ్ఎంసీ. మహానగర శివారు ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధిపై దృష్టిసారించిన జీహెచ్‌ఎంసీ గతంలో మాదిరిగా కాకుండా విభిన్నంగా ఉండే థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు ట్రీ పార్కులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో పడింది.
ఈ థీమ్ పార్కులు వినోదం, పచ్చదనం అందిస్తూనే సబ్జెక్ట్ థీమ్ తో దృష్టిని కేంద్రీకరిస్తాయి. నగరవ్యాప్తంగా రూ. 132 కోట్ల రూపాయల వ్యయంతో 57 థీమ్ పార్కులను చేపట్టారు. ఇందులో 6 థీమ్ పార్క్ లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇవీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగతావి తుది దశలో ఉండగా... త్వరలోనే అన్నీ పనులు పూర్తికానున్నాయి.
ఎల్ బీ నగర్ జోన్ లో 13 థీమ్ పార్క్ లు కాగా ఒక థీమ్ పార్క్ పూర్తి చేశారు.
చార్మినార్ జోనల్ లో మూడుకి మూడు పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయి.
ఖైరతాబాద్ జోనల్ లో 14 థీమ్ పార్క్ లు చేపట్టగా ఒకటి పూర్తి అయింది. మిగతావి పనులు నడుస్తున్నాయి.
శేరిలింగంపల్లి జోన్ లో 10 పనులు చేపట్టగా రెండు పనులు పూర్తి చేశారు.
కూకట్ పల్లి జోన్ లో 6 పనులు చేపట్టగా అందులో ఒకటి పూర్తి అయింది.
సికింద్రాబాద్ జోన్ లో 11 పనులు చేపట్టగా ఒకటి పూర్తి అయింది.
ట్రీ పార్కులు...
థీమ్ పార్కులే కుండా... ట్రీ పార్కులపై కూడా దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. నగర పరిధిలో ఇప్పటివరకు 406 ట్రీ పార్క్ లను ఏర్పాటు చేశారు. ఎల్ బి నగర్ జోన్ లో 104 ట్రీ పార్క్ లను ఏర్పాటు చేశారు. చార్మినార్ జోన్ లో 23, ఖైరతాబాద్ జోన్ లో 86, శేరిలింగంపల్లి జోన్ లో 97, కూకట్ పల్లి జోన్ లో 56, సికింద్రాబాద్ జోన్ లో ట్రీ పార్కు లను ఏర్పాటు చేశారు.