Gangula on Rajasingh: అహంకారంతో మాట్లాడొద్దు.. మర్యాద నేర్చుకోవాలన్న గంగుల
07 November 2023, 6:50 IST
- Gangula on Rajasingh:బండి సంజయ్ నామినేషన్ ర్యాలీ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు...రాజా సింగ్ అహంకార పూరితంగా, అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బిఆర్‌ఎస్ మంత్రి గంగుల కమలాకర్
Gangula on Rajasingh: బండి సంజయ్,రాజాసింగ్ లు ఇద్దరు ఒకే కోవకు చెందిన వారని గంగుల మండి పడ్డారు. పార్టీలోని అభ్యర్థులను గెలిపించమని బండి సంజయ్‌కి బీజేపీ పార్టీ హెలికాప్టర్ ఇస్తే ఈయనను గెలిపించేందుకు మరో నాయకుడిని తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు.
బలికా బకరా అంటూ రేవంత్ రెడ్డిని సంజయ్ తిట్టాడని నిజానికి బండి సంజయ్,రాజాసింగ్ లే బలికా బకరా అని ఎద్దేవా చేసారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ పార్టీ నిషేధిత జాబితాలో ఉన్న రాజాసింగ్ ఇప్పుడు వచ్చి తమకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
కరీంనగర్ లో పోటీ చేయడానికి భయపడిన బండి సంజయ్ కి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా టికెట్ ఇచ్చి బలికా బకరా చేసారన్నారు. కరీంనగర్ లో గెలిచేది బిఆర్ఎస్ పార్టీయేనని బండి సంజయ్ మూడోసారి మూడోస్థానంలో ఉంటాడనేది రాజాసింగ్ రాసి పెట్టుకోవాలన్నారు.
నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గ్రాఫ్ రెండో స్థానంలో ఉండేదని రాజాసింగ్ ప్రచారం చేయడంతోనే మూడోస్థానానికి గ్రాఫ్ పడిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో కరీంనగర్ పట్టణం ఎంతో సుందరంగా తయారైందని, కరీంనగర్ పట్టణంలో ఉన్న ఒక్క రోడ్డైనా గోషామహల్ లో ఉందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హమీలు నెరవేర్చుకుని ఓట్లు అడుగుతున్నామని ,బండి సంజయ్ ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా చెబుతుంటే ప్రజలు నవ్వు కుంటున్నారన్నారు.
రాజాసింగ్ గోషామహల్ లోనే గెలిచే స్థాయిలేదని అలాంటి నీవు కరీంనగర్ కు వచ్చి నోటికి వచ్చిందల్లా మాట్లాడితే చూస్తు ఊరుకోమని,దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలిచిచూపించమని సవాలు విసిరారు.
అంత సమర్థవంతమైన నాయకుడివైతే నిన్ను బీజేపీ ఎందుకు ప్రక్కన పెట్టిందో సమాధానం చెప్పాలన్నారు...డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో బండి సంజయ్, రాజా సింగ్ ఘోరంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు...ఎంపీగా నువ్వు కరీంనగర్ కు ఎలాంటి పని చేయలేదు కాబట్టే నిన్ను ప్రజలు ఓడించబోతున్నారన్నారు.
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ ను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని...అవతలి వాళ్లపై బురద చల్లి ఓట్లు అడగడం మానేయాలని ,ఇక్కడి ప్రజలకు మీరు ఏం చేసారో చెప్పి ఓట్లు అడగాలని హితవు పలికారు.గోషామహల్ లో రాజా సింగ్ ఎమ్మెల్యేగా గెలిసిన తర్వాత చేసిందేమి లేదన్నారు.
రెచ్చగొట్టే ప్రసంగాలిచ్చి ప్రజలను రెచ్చగొట్టినంత మాత్రాన ఓట్లు రావని,పనులు చేసి ప్రజలను అడిగితే ఓట్లు వస్తాయన్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడైన సంజయ్ ను ఎందుకు పదవి నుంచి తప్పించారో చెప్పాలన్నారు.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు కింద రేషన్ కార్డులు ఇవ్వాల్సింది తాము కాదని, కార్డులు కేంద్రం ఇవ్వాలనే విషయం సంజయ్,రాజాసింగ్ లు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 90 లక్షల రేషన్ కార్డులుంటే యాభై నాలుగు లక్షల కార్డులకే కేంద్రం ఒప్పుకుందని. మిగతావి తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందని,ఇప్పటివరకు కేంద్రం ఒక్క కొత్త కార్డు కూడా మళ్ళీ మంజూరు చేయలేదన్నారు.
కేంద్రం ఇవ్వకపోయినా తాము కొత్తకార్డులు మంజూరు చేస్తున్నామనే విషయం తెలుసుకుని మాట్లాడాలన్నారు. కరీంనగర్ లో ఈ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని 2014, 2018లో వచ్చిన మెజార్టీ కలుపుకుని మరింత మెజార్టీతో గెలుస్తామని జోస్యం చెప్పారు. ప్రజలు విధ్వంసాన్ని కోరుకోవడం లేదని,అభివృద్ది కోరుకుంటున్నారని అందుకే బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
రిపోర్టర్ గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా